గురువారం 13 ఆగస్టు 2020
National - Jul 27, 2020 , 17:08:38

ఉపాధికూలీగా భారత వీల్‌చైర్‌ క్రికెట్‌ టీం మాజీ కెప్టెన్‌

ఉపాధికూలీగా భారత వీల్‌చైర్‌ క్రికెట్‌ టీం మాజీ కెప్టెన్‌

డెహ్రడూన్‌: అతడు భారత వీల్‌చైర్‌ క్రికెట్‌ టీం మాజీ కెప్టెన్‌. ప్రస్తుతం ఎంతో మందికి కోచింగ్‌ ఇస్తున్నాడు. అయితే, కరోనా అతడిని ఉపాధి కూలీగా మార్చేసింది. అతడిప్పుడు బ్యాట్‌, బాల్‌ వదిలేసి సొంతూరిలోనే ఉపాధి పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. 

ఉత్తరాఖండ్‌ రాష్ట్రంలోని పిథోర్‌గఢ్‌ జిల్లా రాయ్‌కోట్‌ గ్రామానికి చెందిన రాజేందర్‌సింగ్‌ ధామి (34) దివ్యాంగుడు. మూడేళ్ల వయస్సులో పోలియోతో కదలలేని స్థితికి చేరుకున్నాడు. చిన్నప్పటినుంచే క్రికెట్‌పై మక్కువ పెంచుకున్నాడు. వీల్‌చైర్‌ క్రికెట్‌లో నైపుణ్యం సాధించాడు. అలాగే, చదువుల్లోనూ ప్రతిభ చూపాడు. హిస్టరీలో మాస్టర్‌ డిగ్రీతోపాటు బీఈడీ పూర్తి చేశాడు. భారత వీల్‌చైర్‌ టీంకు ఐదు మ్యాచ్‌లలో కెప్టెన్‌గా వ్యవహరించాడు. కఠ్మండు, మలేషియా, బంగ్లాదేశ్‌లలో మ్యాచ్‌లు ఆడాడు. 

లాక్‌డౌన్‌తో ఉపాధికి గండి..

ప్రస్తుతం ఉత్తరాఖండ్‌ రాష్ట్ర వీల్‌చైర్‌ క్రికెట్‌ టీంకు కెప్టెన్‌గా ఉన్నాడు ధామి. అలాగే, రుద్రాపూర్‌లో  ఔత్సాహిక దివ్యాంగులకు క్రికెట్‌ కోచింగ్‌ ఇస్తుండేవాడు. కరోనా లాక్‌డౌన్‌ వల్ల అది ఆగిపోయింది. దీంతో అతడు స్వగ్రామం చేరుకున్నాడు. అతడి సోదరుడు గుజరాత్‌లో ఓ హోటల్‌లో పనిచేస్తుండేవాడు. కరోనా మహమ్మారి వల్ల అతడి ఉద్యోగం పోయింది. దీంతో వృద్ధులైన తల్లిదండ్రుల పోషణభారం ధామిపై పడింది. చేసేదేమీ లేక ఊళ్లోనే ఉపాధి హామీ పనులకు వెళ్లి, వచ్చే కూలితో కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు.

2015లో ధామి రాష్ట్రస్థాయి అవార్డు అందుకున్నాడు. అప్పుటి ఉత్తరాఖండ్‌ సీఎం హరీశ్‌రావత్‌, ధామికి రూ. 5,000 నగదుతోపాటు ప్రశంసాపత్రం ఇచ్చారు. ప్రభుత్వ ఉద్యోగం ఇస్తానని హామీ ఇచ్చినా అది నెరవేరలేదు.  ఇటీవల ధామి దీనగాథ తెలుసుకున్న బాలీవుడ్‌ విలన్‌, రియల్‌లైఫ్‌ హీరో సోనుసూద్‌ అతడికి రూ. 11,000 ఆర్థికం సాయం చేశాడు. భవిష్యత్తులోనూ ఆదుకుంటానని హామీ ఇచ్చాడు.  


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo