శుక్రవారం 03 ఏప్రిల్ 2020
National - Mar 24, 2020 , 14:36:20

సింథియాల‌పై ఫోర్జ‌రీ కేసులు మూసివేత‌

సింథియాల‌పై ఫోర్జ‌రీ కేసులు మూసివేత‌

భోపాల్‌: మ‌ధ్య‌ప్ర‌దేశ్ కాంగ్రెస్ పార్టీలో తిరుగుబాటు లేవ‌నెత్తి క‌మ‌ల్‌నాథ్ స‌ర్కారును కుప్ప‌కూల్చ‌డంతోపాటు.. రాష్ట్రంలో మ‌ళ్లీ బీజేపీ అధికారంలోకి వ‌చ్చేందుకు కార‌ణ‌మైన‌ జ్యోతిరాధిత్య సింథియాపై బీజేపీ వ‌రాలు కురిపిస్తున్న‌ది. ఇప్ప‌టికే సింథియాకు రాజ్య‌స‌భ సీటు ఆఫ‌ర్ చేసిన బీజేపీ.. అంత‌కంటే ముందే మ‌రో ప్ర‌యోజ‌నం చేకూర్చింది. సింథియా, అత‌ని కుటుంబ‌స‌భ్యుల‌పై న‌మోదైన ఫోర్జ‌రీ కేసుల‌ను ఆర్థిక నేరాల విభాగం (ఈఓడ‌బ్ల్యూ) మూసివేయ‌డం.. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ చ‌ల‌వవ‌ల్లే సాధ్య‌మైంద‌ని స‌ర్వ‌త్రా చ‌ర్చ జ‌రుగుతున్న‌ది. 

జ్యోతిరాధిత్య సింథియా అత‌ని కుటుంబ స‌భ్యులు ఒక భూమి అమ్మకం కోసం సంత‌కాలు ఫోర్జ‌రీ చేసి త‌ప్పుడు ప‌త్రాలు సృష్టించిన‌ట్లు గ‌తంలో కేసు న‌మోదైంది. సురేంద్ర శ్రీవాస్త‌వ అనే వ్య‌క్తి ఫిర్యాదు మేర‌కు అప్ప‌ట్లో ఆర్థిక నేరాల విభాగం.. సింథియా, అత‌ని కుటుంబ స‌భ్యుల‌పై కేసు న‌మోదు చేసింది. అయితే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండ‌టంతో ఇన్నాళ్లు ఈ కేసులో ఎలాంటి చ‌ల‌నం క‌నిపించ‌లేదు.

అయితే మార్చి 10న సింథియా తిరుగ‌బాటు చేయ‌గానే క‌మ‌ల్ నాథ్ స‌ర్కారు కేసును తిర‌గ‌దోడే ప్ర‌య‌త్నం చేసింది. ఇంత‌లో కాంగ్రెస్ ప్ర‌భుత్వం ప‌డిపోవ‌డంతో  ఆ కేసు మ‌ళ్లీ అట‌కెక్కింది. కాగా, ఉన్న‌ట్టుండి ఇప్పుడు సింథియాల‌పై కేసును మూసివేయ‌డంతో.. క్విడ్ ప్రోకో జ‌రిగింద‌ని కాంగ్రెస్ ఆరోపిస్తున్న‌ది. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వ‌చ్చేలా జ్యోతిరాధిత్య‌ సింథియా స‌హ‌క‌రించినందుకే.. ఇప్పుడు బీజేపీ సింథియాల‌పై కేసుల‌ను మూసివేయించింద‌ని విమ‌ర్శిస్తున్న‌ది.    


logo