గురువారం 24 సెప్టెంబర్ 2020
National - Aug 12, 2020 , 13:04:17

మ‌రిచిపో.. క్ష‌మించు.. ఎమ్మెల్యేల‌తో రాజ‌స్థాన్ సీఎం

మ‌రిచిపో.. క్ష‌మించు.. ఎమ్మెల్యేల‌తో రాజ‌స్థాన్ సీఎం

హైద‌రాబాద్‌: రాజ‌స్థాన్ రాజ‌కీయ సంక్షోభానికి మాజీ డిప్యూటీ సీఎం స‌చిన్ పైల‌ట్ తెర‌దించిన విష‌యం తెలిసిందే. అయితే నెల రోజుల పాటు సాగిన ఉత్కంఠ‌పై ఆ రాష్ట్ర సీఎం అశోక్ గెహ్లాట్ స్పందించారు. జైస‌ల్మేర్ రిసార్ట్‌లో ఉంటున్న త‌మ మ‌ద్ద‌తు ఎమ్మెల్యేల‌ను క‌లిసిన సీఎం ఆ త‌ర్వాత మీడియాతో మాట్లాడారు.  కొంద‌రు ఎమ్మెల్యేలు స‌హ‌జంగా అలిగార‌ని ఆయ‌న రెబ‌ల్స్‌ను ఉద్దేశిస్తూ కామెంట్ చేశారు.  అన్నీ మ‌రిచిపోయి, క్ష‌మించి ముందుకు సాగాల‌ని సీఎం గెహ్లాట్ తెలిపారు.  పైల‌ట్‌తో పాటు మ‌రో 18 మంది ఎమ్మెల్యేలు గెహ్లాట్‌పై తిరుగుబాటు చేసిన విష‌యం తెలిసిందే. అయితే సీఎంకు అండ‌గా వంద మంది ఎమ్మెల్యేలు నిలిచారు. రాహుల్‌, ప్రియాంకా వ‌ద్రాల జోక్యంతో స‌చిన్ పైల‌ట్ దిగివ‌చ్చి మ‌ళ్లీ కాంగ్రెస్‌లో చేరారు. 

ఎమ్మెల్యేలు అల‌గ‌డం స‌హ‌జ‌మే అని, నెల  రోజ‌లు సాగిన వ్య‌వ‌హారం స‌హ‌జ‌మైంద‌ని, దేశానికి, ప్ర‌జ‌ల‌కు సేవ చేయాలంటే కొన్ని సంద‌ర్భాల్లో స‌హ‌నంతో ఉండాల‌ని వారికి చెప్పాన‌ని, ప్ర‌జాస్వామ్యాన్ని ర‌క్షించుకోవాల‌ని సీఎం గెహ్లాట్ తెలిపారు.  త‌ప్పుల‌ను క్ష‌మించాల‌ని, ప్ర‌జాస్వామ్యం కోసం త‌ప్ప‌దు అని, ప్ర‌జాస్వామ్యం ప్ర‌మాదంలో ప‌డింద‌ని, వంద మంది ఎమ్మెల్యేల‌తో త‌న‌తోనే ఉన్నార‌ని, బీజేపీ విఫ‌ల‌మైంద‌ని, క‌ర్నాట‌క‌-మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో ప్ర‌భుత్వాల‌ను కూల్చిన‌ట్లు ఇక్క‌డ చేయ‌లేక‌పోయింద‌ని సీఎం గెహ్లాట్ అన్నారు. శుక్ర‌వారం నుంచి రాజ‌స్థాన్ అసెంబ్లీ ప్రారంభంకానున్న‌ది. కానీ ఇప్ప‌టివ‌ర‌కు గెహ్లాట్‌, పైల‌ట్‌లు ఎదురుప‌డ‌లేదు.
logo