శనివారం 06 జూన్ 2020
National - May 09, 2020 , 18:49:24

ఆ కుటుంబానికి లాక్‌డౌన్ ఓ అందమైన అనుభవం

ఆ కుటుంబానికి లాక్‌డౌన్ ఓ అందమైన అనుభవం

హైదరాబాద్: పరసీమల్లో కరోనా లాక్‌డౌన్ కారణంగా ఇరుక్కు పోవడం అందరికీ చేదు అనుభవాలు మిగులుస్తుందని అనుకోరాదు. కొందరికి అవి మరపురాని రోజులుగా మిగిలిపోతాయి. ఓ ఫ్రెంచ్ కుటుంబం ప్రస్తుతం భారత్‌లో చిక్కువడింది. అప్పుడే 50 రోజులు కూడా గడిచిపోయాయి. కానీ వారికి ఇల్లు ఏమాత్రం గుర్తుకు రావడం లేదు. హాయిగా ఇక్కడే ఉండిపోతే బాగుండు అనిపిస్తుందట. పల్లారెస్ కుటుంబం అంటే తల్లీ వర్జీనియా పలారెస్, తండ్రి పాట్రిస్ పలారెస్, ముగ్గురు పిల్లలు. రోడ్డుమార్గం ద్వారా ఎస్యూవీ వాహనంలో టర్కీ, ఇరాన్, పాకిస్థాన్ మీదుగా ఇండియా వచ్చారు. నేపాల్ కు వెళదామని అనుకుంటుండగా లాక్‌డౌన్ వచ్చిపడింది. నేపాల్ సరిహద్దుల్లోని పాలీ ఢాలా అనే గ్రామంలో వారు చిక్కుబడ్డారు. ఆ ఊరిలోని ఒక ఆలయం ప్రాంగణంలో ఉంటున్నారు. వాహనంపై ఏర్పాటు చేసుకునే టెంటులో వారందరూ నిద్రిస్తారు. మరచిపోలేని అపూర్వమైన ఆతిథ్యం తమకు లభిస్తున్నదని ఫ్రాన్స్‌లోని ఓ మందుల కంపెనీలో పనిచేసే పాట్రిస్ మీడియాకు చెప్పారు.

గ్రామస్థులు పొద్దున్నే తాజా పాలు, కూరగాయలు తెచ్చిస్తారు. పైసా తీసుకోరు. మా అబ్బాయికి జ్వరం వస్తే ఎలాంటి భయాలు పెట్టుకోకుండా వచ్చి సపర్యలు చేశారు. మా బసకు జ్ఞాపకంగా వారు మూడు చెట్లను కూడా నాటారు అని ఆయన చెప్పారు. ఓ 66 సంవత్సరాల హిందూ పూజారి వారికి గుడి ఆవరణలో ఆశ్రయం ఇచ్చారు. స్థానికులు ఆయనను హరిదాస్ బాబా అని పిలుస్తారు. గుడి ఆవరణలో అంతా కలిసే వంట చేసుకుంటారు. సాయంత్రం బాబా చేసే పూజలకు అందరూ కలిసే హాజరు అవుతారు. ఫ్రెంచ్ పేర్లు పలకడం కష్టంగా ఉందని వర్జీనియాను బాబా యశోద అని హిందూ పేరుతో పిలుస్తున్నారు. బాబా శుద్ధ శాకాహారి కనుక పలారెస్ కుటుంబం కూడా రోజూ శాకాహరమే భోంచేస్తున్నారు.

మాంసాహారానికి అలవాటైన ప్రాణం అప్పుడప్పుడూ లాగుతుంటుందని పలారెస్ చెప్పారు. ఎప్పుడు వీలైతే అప్పుడు నేపాల్‌కు పోతామని పలారెస్ చెప్పారు. ఇప్పట్లో ఫ్రాన్స్‌కు మాత్రం వెళ్లబోమని తేల్చిచెప్పారు. యూరప్ కన్నా ఇక్కడే కరోనా తగినవిధంగా అదుపుచేస్తున్నారని ఆయన అభిప్రాయం. సమీపంలోని పోలీసు స్టేషన్ నుంచి ఇన్‌స్పెక్టర్ షా మహమ్మద్ తరచుగా వచ్చి యోగక్షేమాలు కనుక్కుని వెళ్తుంటారు. దగ్గరలో ఏదైనా మంచి హోటల్ చూసిపెట్టమంటారా? అని ఆయన అడిగితే వద్దు.. 'ఇక్కడే ఈ గుడి ఆవరణలోనే హాయిగా ఉందని' చెప్పారట పల్లారెస్.


logo