పాట్నా: లైంగిక దాడికి యత్నించిన ఒక వ్యక్తికి బెయిల్ కోసం కోర్టు వింత షరతు విధించింది. అతడు గ్రామంలోని మహిళలందరి బట్టలు ఆరు నెలలపాటు ఉచితంగా ఉతకడంతోపాటు ఇస్త్రీ చేసి ఇవ్వాలని చెప్పింది. కోర్టు ఇచ్చిన ఈ తీర్పుపై ఆ గ్రామంలోని మహిళలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. బీహార్లోని మజోర్ గ్రామానికి చెందిన 20 ఏండ్ల లాలన్ కుమార్ బట్టలు ఉతుకుతూ జీవనోపాధి పొందేవాడు. ఈ ఏడాది ఏప్రిల్ నెలలో మహిళపై లైంగిక దాడి యత్నం కేసులో పోలీసులు అతడ్ని అరెస్ట్ చేశారు.
కాగా, బెయిల్ కోసం కుమార్ దాఖలు చేసిన పిటిషన్పై కొర్టు విచారణ జరిపింది. దీని కోసం వింత షరతు విధించింది. అతడు ఆరు నెలల పాటు గ్రామంలోని మహిళలందరి బట్టలు ఉచితంగా ఉతికి, ఇస్త్రీ చేసి ఇవ్వాలని చెప్పింది. దీనికి అయ్యే ఖర్చును అతడే భరించాలని పేర్కొంది.
కోర్టు బుధవారం ఇచ్చిన ఈ తీర్పుపై గ్రామంలోని సుమారు 2 వేల మంది మహిళలు హర్షం వ్యక్తం చేసినట్లు గ్రామ సర్పంచ్ నసీమా ఖాటూన్ తెలిపారు. ‘ఈ తీర్పు చారిత్రాత్మకమైంది. మహిళల గౌరవాన్ని పెంపొందిస్తుంది. మహిళల గౌరవాన్ని కాపాడటానికి సహాయపడుతుంది’ అని ఆమె అన్నారు.
మహిళలపై జరిగే నేరాల గురించి సమాజంలో చర్చించడంపై ఇది సానుకూల ప్రభావం చూపుతుందని ఆ గ్రామంలో మహిళలు తెలిపారు. ‘ఇది ఒక ముందడుగు. సమాజానికి సందేశాన్ని పంపే విభిన్నమైన శిక్ష’ అని అంజుమ్ పెర్వీన్ అనే మహిళ వ్యాఖ్యానించారు.