బుధవారం 15 జూలై 2020
National - May 02, 2020 , 09:04:29

42 రోజులుగా అంబులెన్స్‌లో.. కరోనాపై యుద్ధం ముగిసిన తర్వాతే ఇంటికి..

42 రోజులుగా అంబులెన్స్‌లో.. కరోనాపై యుద్ధం ముగిసిన తర్వాతే ఇంటికి..

లక్నో : ఓ అంబులెన్స్‌ డ్రైవర్‌ గత 42 రోజుల నుంచి అంబులెన్స్‌లో ఉంటున్నాడు. లాక్‌డౌన్‌ అమలైనప్పటి నుంచి ఏ ఒక్కరోజు కూడా ఇంటికి వెళ్లకుండా చిత్తశుద్ధితో పని చేస్తున్నాడు. రంజాన్‌కు కూడా వెళ్లనని ఆ డ్రైవర్‌ తెగేసి చెబుతున్నాడు. కరోనాపై యుద్ధం ముగిసిన తర్వాతే ఇంటికి వెళ్తాను అని డ్రైవర్‌ స్పష్టం చేశాడు.

బాబు భార్తి(65) అనే వ్యక్తి ఉత్తరప్రదేశ్‌ సాంబాల్‌ జిల్లా ప్రభుత్వాసుపత్రి అంబులెన్స్‌ డ్రైవర్‌గా కొనసాగుతున్నారు. కరోనా వైరస్‌ ప్రబలినప్పటి నుంచి సాంబాల్‌ జిల్లాలోని హాట్‌స్పాట్‌ ఏరియాలు, కంటైన్‌మెంట్‌ జోన్లలోని కరోనా బాధితులను ఆస్పత్రికి తరలిస్తున్నారు బాబు భార్తి. ఈ క్రమంలో అతను ఇంటికి వెళ్లడం మానేశారు. గత 42 రోజుల నుంచి తన భార్యాపిల్లలను చూడలేదు. కేవలం ప్రతి రోజు ఉదయం ఫోన్‌లోనే కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్నాడు డ్రైవర్‌. 

విధులే ముఖ్యం.. అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా..

లాక్‌డౌన్‌ అమలైనప్పటి నుంచి అంబులెన్స్‌లోనే నిద్రిస్తున్నాను అని బాబు తెలిపారు. వ్యవసాయ పొలాల వద్ద బోరు కనిపిస్తే అక్కడే స్నానం చేస్తున్నాను. భోజన సదుపాయం ఆస్పత్రి వర్గాలు సిద్ధం చేస్తున్నాయి. కరోనాపై యుద్ధం ముగిసిన తర్వాతే తన ఇంటికి వెళ్తాను. ప్రతి రోజు ఉదయం కుటుంబ సభ్యులతో మాట్లాడి తాను జాగ్రత్తగానే ఉన్నానని చెబుతున్నాను. తాను ఇప్పుడు ఇంటికి వెళ్లలేను. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో తనకు విధులే ముఖ్యమని స్పష్టం చేశారు. సమయానికి అంబులెన్స్‌ అందుబాటులో లేకపోతే చాలామంది రోగులు ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉందన్నారు. ప్రతి రోజు తాను అంబులెన్స్‌ను శానిటైజ్‌ చేస్తున్నానని బాబు చెప్పారు. 

బాబుపై డాక్టర్‌ ప్రశంసలు

సాంబాల్‌ జిల్లా కొవిడ్‌-19 ర్యాపిడ్‌ యాక్షన్‌ టీమ్‌ ఇంచార్జి డాక్టర్‌ నీరజ్‌ శర్మ అంబులెన్స్‌ డ్రైవర్‌ బాబు భార్తిపై ప్రశంసల వర్షం కురిపించారు. బాబు తన విధుల పట్ల చిత్తశుద్ధితో పని చేస్తున్నారని తెలిపారు. ఇప్పటి వరకు 1100 మంది కరోనా అనుమానితులను ఆస్పత్రికి తీసుకువచ్చాం. ఏ సమయంలోనైనా బాబు తమకు అందుబాటులో ఉండి కరోనా బాధితులను ఆస్పత్రికి తీసుకువచ్చేందుకు సహకరిస్తున్నాడు అని డాక్టర్‌ తెలిపారు. బాబు నివాసం ఆస్పత్రికి కేవలం 9 కిలోమీటర్ల దూరమే అయినప్పటికీ.. ఇంటికి వెళ్లడం లేదు. సాంబాల్‌ జిల్లా గ్రీన్‌ జోన్‌గా మారినప్పుడే ఇంటికి వెళ్తానని చెబుతున్నట్లు డాక్టర్‌ నీరజ్‌ చెప్పారు. ప్రస్తుతం సాంబాల్‌ జిల్లా ఆరెంజ్‌ జోన్‌లో ఉంది. సాంబాల్‌ జిల్లాలో ఇప్పటి వరకు 19 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, ఇద్దరు మృతి చెందారు. మరో 200 మంది క్వారంటైన్‌లో ఉన్నారు. 


logo