మంగళవారం 24 నవంబర్ 2020
National - Oct 29, 2020 , 17:55:02

అభివృద్ధితోపాటు పర్యావరణంపై దృష్టి పెట్టాలి : ఉపరాష్ట్రపతి

అభివృద్ధితోపాటు పర్యావరణంపై దృష్టి పెట్టాలి : ఉపరాష్ట్రపతి

న్యూఢిల్లీ : పర్యావరణ హిత, హరిత భవనాల నిర్మాణాన్ని తప్పనిసరి చేసేందుకు ఇదే మంచి తరుణమని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. ఈ దిశగా ప్రభుత్వాలు, ఆర్థిక సంఘాలు, స్థానిక సంస్థలు నడుం బిగించి.. హరిత భవనాలకు పన్నురాయితీల ద్వారా ప్రోత్సాహం అందించాల్సిన అవసరం ఉన్నదన్నారు. సీఐఐ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘గ్రీన్ బిల్డింగ్ కాంగ్రెస్ – 2020’ని గురువారం న్యూఢిల్లీ ఉపరాష్ట్రపతి నివాసంలో నుంచి అంతర్జాల వేదిక ద్వారా ఉపరాష్ట్రపతి ప్రారంభించారు. 

కొత్తగా నిర్మిస్తున్న భవనాలతోపాటు ఇప్పటికే ఉన్న భవనాల్లోనూ పచ్చదనాన్ని ప్రోత్సహించేలా, పర్యావరణ హిత పద్ధతులను ఆవలంబించేలా, జలసంరక్షణతోపాటు ఇంధన ఆదా జరిగేలా ప్రతి ఒక్కరూ చొరవతీసుకోవాల్సిన సమయం ఆసన్నమైందన్నారు.  తక్కువ కర్బన పదార్థాల వినియోగాన్ని ప్రోత్సహించే సాంకేతికతను వినియోగించడంపై, సుస్థిరమైన పర్యావరణ హిత భవనాల నిర్మాణాలపైనా అవగాహన పెంచే కార్యక్రమాలను వేగంగా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉన్నదని సూచించారు. సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను చేరుకునే క్రమంలో.. అభివృద్ధితోపాటు పర్యావరణ పరిరక్షణను కూడా దృష్టిలో ఉంచుకోవాలన్నారు. ఇండియా గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ ‘నెట్ జీరో కార్బన్ బిల్డింగ్స్’ దిశగా ఉద్యమాన్ని ప్రారంభించాలన్నారు. ఇందులో బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా, క్రెడాయ్ వంటి సంస్థలు భాగస్వామ్యం వహించాలన్నారు. గ్రామాల్లోనే భారతదేశ ఆత్మ ఉన్నదని, గ్రామాల అభివృద్ధే దేశాభివృద్ధి అన్న మహాత్ముడి మాటలను ఈ సందర్భంగా గుర్తు చేసిన ఉపరాష్ట్రపతి.. పట్టణాల్లో మాదిరిగానే గ్రామాల్లోనూ అన్ని వసతులను కల్పించే దిశగా కృషి జరగాలన్నారు. అన్ని రాష్ట్రాల్లో ఈ కార్యాచరణను విస్తరింపజేయాలని సీఐఐకి సూచించారు. సీఐఐ 125వ వార్షికోత్సవం సందర్భంగా ఆ సంస్థను ప్రత్యేకంగా అభినందించిన వెంకయ్యనాయుడు.. ఈ సందర్భంగా కాఫీటేబుల్ బుక్‌తో పాటు ‘రేటింగ్ సిస్టం ఆన్ హెల్త్‌కేర్, లాజిస్టిక్స్ అండ్ నెట్ జీరో వాటర్’ పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సీఐఐ మాజీ అధ్యక్షుడు, సీఐఐ చైర్మన్ జంషిద్ నౌరోజీ గోద్రేజ్, సీఐఐ ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ చైర్మన్ వీ సురేశ్, సీఐఐ డైరెక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీ, సీఐఐ వైస్ చైర్మన్ గుర్మీత్ సింగ్ అరోరాతో పాటు నిర్మాణ రంగ ప్రముఖులు, అధికారులు, ఇంజనీర్లు, డెవలపర్లు, బిల్డర్లు, ఆర్కిటెక్ట్‌లు పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.