e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, September 18, 2021
Home News మాతృభాష పరిరక్షణ కోసం సృజనాత్మక విధానాలపై దృష్టి : ఉపరాష్ట్రపతి

మాతృభాష పరిరక్షణ కోసం సృజనాత్మక విధానాలపై దృష్టి : ఉపరాష్ట్రపతి

హైదరాబాద్ : మాతృభాషలను కాపాడుకునేందుకు సృజనాత్మక విధానాల మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని భారత ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు పిలుపునిచ్చారు. ఎంత సృజనాత్మకంగా మనం భాషను ముందుకు తీసుకువెళతామో, అంతే వేగంగా ముందు తరాలు భాష వైపు ఆకర్షితమౌతాయన్నారు. ప్రభుత్వాలు భాషను కాపాడాలని సంకల్పిస్తే నిధులు ఇవ్వగలవ‌ని, అదే సంకల్పం ప్రజలు తీసుకున్నప్పుడే తరతరాలకు మనగలదని దిశానిర్దేశం చేశారు. “తెలుగు కూటమి” సంస్థ నిర్వహించిన భాషాభిమానుల వ‌ర్చువ‌ల్‌ సదస్సులో ఉపరాష్ట్రపతి పాల్గొని మాట్లాడారు.

మాతృభాష‌ను ప‌రిర‌క్ష‌ణ‌కు ఐదు సూత్రాలు..

ఈ సంద‌ర్భంగా మాతృభాషను కాపాడుకునేందుకు ఐదు సూత్రాలను ఉప‌రాష్ట్ర‌ప‌తి పునరుద్ఘాటించారు. ప్రాథమిక విద్య మాతృభాషలో అందేలా చూడడం, పరిపాలనా భాషగా మాతృభాషకు ప్రాధాన్యత ఇవ్వడం, న్యాయస్థాన కార్యకలాపాలు, తీర్పులు మాతృభాషలో అందించడం, క్రమంగా సాంకేతిక విద్యలో మాతృభాషల వినియోగం పెరగడంతో పాటు ప్రతి ఒక్కరూ తమ ఇళ్ళలో కుటుంబ సభ్యులతో తెలుగులోనే మాట్లాడాలని సూచించారు.

మాతృభాష‌ను కోల్పోతే గుర్తింపును, గౌర‌వాన్ని కోల్పోతాం..

- Advertisement -

ఇటీవల సుప్రీం కోర్టులో ఆంగ్లంలో తన సమస్యను చెప్పుకోలేక ఇబ్బంది పడుతున్న మహిళకు మాతృభాష అయిన తెలుగులో మాట్లాడే అవకాశం ఇచ్చి, 21 సంవత్సరాలుగా సాగుతున్న భార్యాభర్తల వివాదాన్ని సానుకూల మార్గంలో పరిష్కరించిన చీఫ్ జస్టిస్ ఎన్.వి.రమణ చొరవను ఉపరాష్ట్రపతి అభినందించారు. సరైన న్యాయం అందాలంటే ప్రజలు తమ సమస్యలను తమ మాతృభాషలో తెలియజేసే అవకాశాన్ని ఇవ్వాలని ఈ సందర్భం ద్వారా రుజువైందన్నారు. మాతృభాషను కోల్పోతే గుర్తింపును, గౌరవాన్ని కోల్పోతామన్నారు. మాతృభాషను కాపాడుకునే సంకల్పంతో వివిధ నేపథ్యాలకు చెందిన వారంతా తెలుగు కూటమి సంస్థను ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. తెలుగు భాష పరిరక్షణ ప్రజా ఉద్యమంగా రూపుదాల్చాలన్న తన ఆకాంక్ష వెనుక ప్రధాన కారణం ఇదేనని చెప్పారు.

ప్ర‌భుత్వాల‌తో పాటు ప్ర‌జ‌లు క‌లిసిరావాలి..

ప్రభుత్వాలు తమ కార్యక్రమాలను నిర్వహిస్తూనే ఉంటాయని, అయితే ప్రజలంతా కలిసి తమ భాషను కాపాడుకునేందుకు ప్రయత్నించినప్పుడు ముందు తరాలకు అందజేయడం సాధ్యమౌతుందని తెలిపారు. మన సాంస్కృతిక వైవిధ్యాలు, సంప్రదాయాలు, కళలు, సంగీతం, నాట్యం, ఆచారాలు, పండుగలు, సంప్రదాయ విజ్ఞానం, వృత్తుల వారసత్వం లాంటి వాటిని మాతృభాషను కాపాడుకోవడం ద్వారానే పరిరక్షించుకోవచ్చన్నారు. భాషంటే ఘనమైన వారసత్వం అన్నారు.

ప‌ద‌కోశాలు రూపొందించాలి..

ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలతో పాటు భాషాభిమానులు, భాషావేత్తలు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, మీడియా మాతృభాష పరిరక్షణలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. మారుమూల గ్రామాల నుంచి భాషా పదజాలాన్ని సమీకరించడం, అంతరిస్తున్న పదాలను వెలికితీసి కాపాడుకోవడం, శాస్త్ర సాంకేతిక పారిభాషిక పదాలను తయారు చేయడం, వృత్తి పదకోశాలు, మాండలిక పదకోశాలు రూపొందించడం లాంటివి ఆవశ్యకమని తెలిపారు.

ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కె. వి. రమణాచారి, విశ్రాంత ఐ.ఏ.ఎస్. అధికారి నందివెలుగు ముక్తేశ్వర రావు, విశ్రాంత ఐ.పి.ఎస్. అధికారి చెన్నూరు ఆంజనేయరెడ్డి, తానా మాజీ చైర్మన్ తాళ్ళూరి జయశేఖర్, ద్రవిడ విశ్వవిద్యాలయ డీన్ పులికొండ సుబ్బాచారి, తెలంగాణ సాహిత్య అకాడమీ మాజీ చైర్మన్ నందిని సిధారెడ్డి, భారత భాషాశాస్త్రవేత్తల సంఘం అధ్యక్షులు గారపాటి ఉమామహేశ్వర రావు, తెలుగు కూటమి అధ్యక్షులు పారుపల్లి కోదండరామయ్య సహా ప్రపంచంలోని పలు దేశాలకు చెందిన దాదాపు వెయ్యిమంది తెలుగు భాషాభిమానులు, భాషావేత్తలు స‌మావేశంలో పాల్గొన్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana