బుధవారం 23 సెప్టెంబర్ 2020
National - Aug 10, 2020 , 11:02:34

మ‌ణిపూర్ అసెంబ్లీలో నేడు బ‌ల‌ప‌రీక్ష‌

మ‌ణిపూర్ అసెంబ్లీలో నేడు బ‌ల‌ప‌రీక్ష‌

న్యూఢిల్లీ‌: రాజ‌కీయ సంక్షోభం నెల‌కొన్న మ‌ణిపూర్ అసెంబ్లీలో ఈరోజు బ‌ల‌నిరూప‌ణ జ‌ర‌గ‌నుంది. సీఎం బీరేన్ సింగ్ నేతృత్వంలోని బీజేపీ స‌ర్కార్‌పై కాంగ్రెస్ ఎమ్మెల్యే కీష‌మ్ మేఘ‌చంద్ర అవిశ్వాస తీర్మాణం ప్ర‌వేశ‌పెట్టారు. దీనిపై ఈరోజు అసెంబ్లీ ప్ర‌త్యేకంగా స‌మావేశం కానుంది. ఈ నేప‌థ్యంలో ఇరు పార్టీలు త‌మ ఎమ్మెల్యేల‌కు విప్ జారీచేశాయి. 


మొత్తం 60 మంది స‌భ్యులున్న మ‌ణిపూర్ అసెంబ్లీలో ప్రస్తుతం 53 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇందులో అధికార బీజేపీకి సొంతంగా 18 మంది ఎమ్మెల్మేలు, మిత్ర‌ప‌క్షాల‌తో క‌లిపి మొత్తం 29 మంది ఎమ్మెల్యేల బ‌లం ఉన్న‌ది. కాగా, ప్ర‌తిప‌క్ష కాంగ్రెస్ పార్టీకి 24 మంది స‌భ్యుల బ‌లం ఉన్న‌ది. ముగ్గురు ఎమ్మెల్యేలు త‌మ ప‌ద‌వుల‌కు రాజీనామా చేయ‌గా, మ‌రో న‌లుగురు అన‌ర్హ‌త వేటుకు గుర‌య్యారు. బ‌ల‌నిరూప‌ణ‌లో బీజేపీ ప్ర‌భుత్వం నెగ్గాలంటే మొత్తం 30 మంది ఎమ్మెల్యేల ఓట్లు అవ‌స‌ర‌మ‌వనున్నాయి. 


బీజేపీ నేతృత్వంలోని సంకీర్ణ ప్ర‌భుత్వానికి జూన్ 14న ఆరుగురు ఎమ్మెల్యేలు మ‌ద్ద‌తు ఉప‌సంహ‌రించుకున్నారు. ఇందులో ముగ్గురు బీజేపీ ఎమ్మెల్యేలు ఉన్నారు. అనంత‌రం వారంతా కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాగా నేష‌న‌ల్ పీపుల్స్ పార్టీ (ఎన్‌పీపీ)కి చెందిన న‌లుగురు ఎమ్మెల్యేలు బీజేపీకి మ‌ద్ద‌తు ప్ర‌క‌టించారు. మిత్ర‌ప‌క్షాల‌తో క‌లిపి త‌మ‌కు 29 మంది ఎమ్మెల్యేల మ‌ద్ద‌తు ఉన్న‌ప్ప‌టికీ తాము త‌ప్ప‌నిస‌రిగా గెలుపొందుతామ‌ని బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు టైకేంద్ర సింగ్ అన్నారు.  


logo