ఆదివారం 17 జనవరి 2021
National - Nov 25, 2020 , 15:20:13

త్వరలో సౌదీ అరేబియాకు విమానాలు

త్వరలో సౌదీ అరేబియాకు విమానాలు

చెన్నై : త్వరలోనే భారత్‌ నుంచి నేరుగా సౌదీ అరేబియాకు విమానాలు నడవనున్నాయి. మహమ్మారి నేపథ్యంలో ఇరుదేశాల మధ్య ప్రయాణానికి వీలుగా ఎయిర్‌ బబుల్‌లో భాగంగా విమానాలు నడిపేందుకు సౌదీ అరేబియాతో భారత్‌ చర్చలు జరుపుతోంది. రియాద్‌లోని భారత దౌత్య కార్యాలయం చేసిన ట్వీట్‌ ప్రకారం.. ఎయిర్ ట్రాన్స్ పోర్ట్ డైరెక్టర్ జనరల్ అలీ రజబ్, జనరల్ అథారిటీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ పలు భారతీయ, సౌదీ విమానయాన సంస్థల ప్రతినిధులతో కలిసి ఇరుదేశాల మధ్య విమాన ప్రయాణాలను ఎలా ప్రారంభించాలన్న విషయమై చర్చలు జరిపారు. దేశంలో కరోనా కేసుల కారణంగా సౌదీ అరేబియా భారత్‌కు అన్ని విమానాల సర్వీసులను నిలిపివేసింది. ప్రస్తుతం ఎన్నారైలు, సౌదీ అరేబియా వీసా కలిగి ఉన్నప్పటికీ భారత్‌లో ఉన్న వారంతా దుబాయి ప్రయాణం కొనసాగిస్తున్నారు.

ముందుగా వారంతా మొదట ట్రానిట్‌ లేదంటే విజిటింగ్‌ వీసాపై వెళ్లి.. ఆ తర్వాత సౌదీ అరేబియాకు వెళ్లేందుకు అనుమతి పొందాల్సి ఉంది. తమిళనాడులో చెల్లుబాటయ్యే వర్క్ వీసాలున్న ప్రజలు అధిక సంఖ్యలో ఉన్నారు. వీళ్లంతా సౌదీకి వెళ్లేందుకు ఇబ్బందులుపడుతున్నారు. కొవిడ్‌ మహమ్మారి కారణంగా సాధారణ అంతర్జాతీయ విమానాలు తాత్కాలికంగా నిలిపివేశారు. వాణిజ్య ప్రయాణికుల సేవలను పునరుద్ధరించడానికి ఉద్దేశించిన ఎయిర్‌ బబుల్‌లో తాత్కాలికంగా విమానాలు నడుపుతున్నారు. ఇప్పటికే అమెరికా, జర్మనీ, ఫ్రాన్స్, యునైటెడ్ కింగ్ డమ్, కెనడా, మాల్దీవులు, యూఏఈ, ఖతార్, బహ్రెయిన్, నైజీరియా, ఇరాక్, ఆఫ్ఘనిస్థాన్, జపాన్ సహా 22 దేశాలతో భారత్ ఒప్పందం చేసుకుంది.