సోమవారం 03 ఆగస్టు 2020
National - Jul 28, 2020 , 01:26:15

భారత్‌కు రాఫెల్‌ బయలుదేరింది

భారత్‌కు రాఫెల్‌ బయలుదేరింది

 • ఫ్రాన్స్‌ నుంచి బయలుదేరిన విమానాలు 
 • బుధవారం అంబాలా ఎయిర్‌ బేస్‌కు 
 • మొదటి దశలో ఐదు ఫైటర్స్‌ సరఫరా 
 • 2021నాటికి మొత్తం 36 విమానాలు రాక 
 • యుద్ధ క్షేత్రంలో ఎదురులేని ఫైటర్స్‌ 

న్యూఢిల్లీ, జూలై 27: ఫ్రాన్స్‌నుంచి కొనుగోలు చేసిన అత్యాధునిక రాఫెల్‌ యుద్ధ విమానాలు భారత్‌కు సోమవారం బయలుదేరాయి. మొదటి దశలో ఐదు విమానాలు ఫ్రాన్స్‌లోని మెరిగ్నాక్‌ వైమానిక స్థావరం నుంచి గాల్లోకి ఎగిరాయి. ఈ విమానాలు బుధవారం భారత్‌లోని అంబాలా ఎయిర్‌ఫోర్స్‌ బేస్‌కు చేరుకుంటాయి. అదేరోజు వాటిని భారత వైమానిక దళంలో చేరుస్తారు. అయితే ఐఏఎఫ్‌కు రాఫెల్స్‌ను అందించే లాంఛనప్రాయమైన కార్యక్రమం ఆగస్టు చివరలో జరుగనుంది. ఫ్రాన్స్‌ నుంచి దాదాపు 7000 కిలోమీటర్ల ప్రయాణించనున్న ఈ విమానాలు మార్గమధ్యంలో యూఏఈలోని ఫ్రాన్స్‌ ఎయిర్‌బేస్‌లో ఆగాయి. అక్కడి నుంచి నిరవధికంగా బయలుదేరి భారత్‌ను చేరతాయి. ప్రస్తుతం భారత్‌ వస్తున్న విమానాల్లో మూడు సింగిల్‌ సీట్‌, రెండు డబుల్‌ సీటర్‌ విమానాలు. చైనాతో ఉద్రిక్తతల దృష్ట్యా ఈ విమానాలను లఢక్‌ సెక్టార్‌లో మోహరించనున్నారు. ఫ్రాన్స్‌ నుంచి రాఫెల్‌ విమానాలు బయల్దేరిన సందర్భంగా.. ఆ దేశంలో ఉన్న భారత రాయబారి జావేద్‌ అష్రఫ్‌ స్పందిస్తూ.. ఈ విమానాలు ఎంతో అందమైనవే కాకుండా భీకరమైన దాడిచేసే మృగం లాంటివి (బీస్ట్‌ అండ్‌ బ్యూటీఫుల్‌) అని పేర్కొన్నారు. 

భారీ డీల్‌ 

రాఫెల్‌ విమానాలను దసాల్ట్‌ సంస్థ తయారుచేసింది. రూ.59,000 కోట్లతో 36 రాఫెల్‌ విమానాల కొనుగోలు కోసం ఫ్రాన్స్‌తో 2016లో భారత్‌ ఒప్పందం కుదుర్చుకుంది. అందులో 10 విమానాలను భారత్‌కు అప్పగించగా భారత పైలట్ల శిక్షణ కోసం ఐదు విమానాలు ఫ్రాన్స్‌లో ఉండిపోయాయి. 2021లోపు మొత్తం 36 విమానాలు భారత్‌కు చేరుకుంటాయి. వీటిలో 30 ఫైటర్‌ జెట్లు కాగా, 6 శిక్షణ విమానాలు. శిక్షణ విమానాల్లో రెండు సీట్లు ఉంటాయి. ఇతర లక్షణాలు అన్నింటికీ ఒకేరకంగా ఉంటాయి. రెండో దశలో వచ్చే విమానాలను పశ్చిమబెంగాల్‌లోని హసిమరా బేస్‌లో నిలిపి ఉంచుతారు. ఈ విమానాలకు షెల్టర్లు, హాంగర్లు, ఇతర నిర్వహణ కోసం అంబాలా, హసిమరా ఎయిర్‌ బేస్‌లలో వాయుసేన రూ.400 కోట్లు ఖర్చు చేసింది. ఇప్పటికే 12మంది భారత పైలట్లకు రాఫెల్స్‌ నడపటంలో శిక్షణ ఇచ్చారు. మరో బృందానికి శిక్షణ కొనసాగుతున్నది.

మన అవసరాలకు అనుగుణంగా మార్పులు 

భారత వాయుసేన అవసరాలకు అనుగుణంగా రాఫెల్‌ విమానాల్లో పలు మార్పులు చేశారు. ఇజ్రాయెలీ హెల్మెట్‌ డిస్‌ప్లేయర్స్‌, రాడార్‌ వార్నింగ్‌ రిసీవర్స్‌, లో బాండ్‌ జామర్స్‌, 10 గంటల ఫ్లైట్‌ డాటా రికార్డింగ్‌, ఇన్‌ఫ్రారెడ్‌ సెర్చ్‌, ట్రాకింగ్‌ సిస్టమ్స్‌ తదితర 13 రకాల వ్యవస్థలను ఏర్పాటుచేశారు. అత్యంత ఎత్తైన ప్రదేశాల్లో అతిశీతల పరిస్థితుల్లో కూడా ఈ విమానాలు సమర్థంగా పోరాడగలవు.


లోహవిహంగం 

పొడవు: 10.3 మీటర్లు

ఎత్తు: 5.3 మీటర్లు

గరిష్ఠ బరువు: 24,500 కిలోలు

ఎగరగలిగే ఎత్తు: 50 వేల అడుగులు

లోడ్‌ (ఆయుధాలను మోసుకెళ్లే) సామర్థ్యం: 9,500 కిలోల వరకు పరిధి: 3,700 కి.మీ

గరిష్ఠ వేగం: 2,222.6 

కి. మీ గంటకు (సాధారణ వేగం 1,389 కి.మీ గంటకు)

 • ఆకాశం నుంచి భూమిపై ఉన్న 300 కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాలపై క్రూయిజ్‌ క్షిపణులు, ఇతర ఆయుధాలను గురితప్పకుండా ప్రయోగించగలవు.
 • యూరోపియన్‌ సంస్థ ఎంబీడీఏ తయారుచేసిన అత్యాధునిక ఎయిర్‌ టు ఎయిర్‌ మెటియోర్‌ క్షిపణులను రాఫెల్స్‌కు అనుసంధానించారు. ఈ క్షిపణుల పరిధి 120-150 కిలోమీటర్లు. గగనతల యుద్ధంలో ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన క్షిపణులుగా వీటికి గుర్తింపు ఉంది.
 • ఈ విమానాలు యుద్ధరంగంలో 780 నుంచి 1650 కిలోమీటర్ల పరిధిలో పోరాడగలవు.
 • ఈ విమానాల్లో అత్యాధునిక రాడార్‌ వ్యవస్థలతోపాటు సెల్ఫ్‌ ప్రొటెక్షన్‌ సూట్లు కూడా ఉంటాయి. 
 • మిరేజ్‌ 2000 విమానాలకోసం తయారుచేసిన ఎంఐసీఏ ఆయుధ వ్యవస్థలను రాఫెల్‌కు కూడా అనుసంధానిస్తారు.

ఏకకాలంలో45 లక్ష్యాలపై

 • గంటకు 2,222 కిలోమీటర్ల వేగం 
 • 2 ఇంజిన్లు.. 11 వేల పౌండ్ల శక్తి 
 • ట్యాంకు నింపితే 3,700 
 • కిలోమీటర్ల ప్రయాణం 
 • గాలిలోనే ఇంధనం 
 • నింపుకునే సామర్థ్యం 

దాడికి పగలూ రాత్రీ తేడా లేదు 

పాకిస్థాన్‌ సరిహద్దు ప్రాంతం బాలాకోట్‌లోని ఉగ్రవాదుల స్థావరాలపై భారత వాయుసేన ఫిబ్రవరి 26, 2019లో మెరుపుదాడులు చేసింది. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ.. ‘రాఫెల్‌ యుద్ధ విమానాలు ఉంటే మన పోరాటం ఇంకో స్థాయిలో ఉండేది’ అన్నారు. రాఫెల్‌ ఫైటర్‌ జెట్ల సామర్థ్యం ఏపాటిదో చెప్పడానికి ఈ ఒక్క మాట చాలు. ప్రస్తుతం ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన యుద్ధ విమానాల జాబితాలో రాఫెల్‌ ముందువరుసలోఉన్నది. గత 13 ఏండ్లుగా యుద్ధ క్షేత్రంలో మెరుగైన సేవలందిస్తున్న అత్యుత్తమ విమానంగా నిలిచింది. ఎఫ్‌-22 రాఫ్టర్‌ (అమెరికా), యూరో ఫైటర్‌ టైఫూన్‌ (బ్రిటన్‌, జర్మనీ), సుఖోయ్‌ సూ-35 (రష్యా)తో పోలిస్తే రాఫెల్‌ విమానాలు వేగంగా స్పందిస్తాయి. 

మెరుపు వేగంతో.. 

పర్వత ప్రాంతాల్లో ఏకకాలంలో 45 లక్ష్యాలపై గురిపెట్టడమే కాదు.. నాలుగు లక్ష్యాలను ఒకేసారి ధ్వంసం చేయగల సామర్థ్యం రాఫెల్‌ విమానాల సొంతం. గగనతలం నుంచి భూతలంలోకి, గగనతలం నుంచి గగనతలంలోకి క్షిపణులను ప్రయోగించగలదు. ఏఈఎస్‌ఏ రాడార్‌తో నడిచే అణ్వాయుధాలను కూడా మోసుకెళ్లగలదు. రెండు ఇంజిన్లు ఉన్న ఈ విమానాలు 11 వేల పౌండ్ల శక్తితో పనిచేస్తాయి. దీంతో గంటకు 2,222.6 కి. మీ. గరిష్ఠ వేగంతో ప్రయాణించగలవు.

మూడుదేశాల్లోనే..

ఒక్కసారి ఇంధనాన్ని నింపుకుంటే 3,700 కి.మీ దూరం వరకు ప్రయాణం చేయగల ఈ విమానాలు గాలిలో ఉండగానే ఇంధనాన్ని నింపుకోగలవు. పైలట్‌లకు రాత్రివేళల్లో స్పష్టంగా కనిపించేందుకు హెల్మెట్‌ మౌంటెడ్‌ డిస్ప్లే, రాడార్‌ రిసీవర్లు, శత్రువుల సిగ్నల్‌ వ్యవస్థలకు అంతరాయం కలిగించే లో-బ్యాండ్‌ జామర్లు,  ఇన్‌ఫ్రారెడ్‌ సెర్చ్‌, ట్రాకింగ్‌ వంటి  వ్యవస్థలు రాఫెల్‌లో ఉన్నాయి. కాగా ఈ యుద్ధ విమానాలను ఇప్పటివరకూ ఫ్రాన్స్‌, ఈజిప్ట్‌, ఖతర్‌ దేశాలు మాత్రమే కలిగి ఉన్నాయి.


logo