గురువారం 02 జూలై 2020
National - May 01, 2020 , 12:21:18

వలస కార్మికులతో పయనమైన తొలి ప్రత్యేక రైలు

వలస కార్మికులతో పయనమైన తొలి ప్రత్యేక రైలు

సంగారెడ్డి: లాక్‌డౌన్‌ వల్ల చిక్కుకుపోయిన వలస కార్మికులు ప్రత్యేక రైలులో వారి స్వస్థలాలకు తరలివెళ్లారు. లాక్‌డౌన్‌ తర్వాత ఇలా కార్మికులను రైలులో తరలించడం ఇదే మొదటిసారి. సుమారు 1239 మంది వలస కార్మికులతో కూడిన ప్రత్యేక రైలు లింగంపల్లి రైల్వే స్టేషన్‌ నుంచి జార్ఖండ్‌కు శుక్రవారం ఉదయం 4.50గంటలకు బయల్దేరింది. తెలంగాణ ప్రభుత్వం విజ్ఞప్తితలో ఈ ప్రత్యేక రైలును ఏర్పాటు చేశామని దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు.

కరోనా వైరస్‌ వ్యాప్తిని నిరోధించడానికి రాష్ట్రంలో మార్చి 22న లాక్‌డౌన్‌ అమల్లోకి వచ్చింది. దీంతో ఎక్కడి రైళ్లు అక్కడే నిలిచిపోయాయి. అయితే పోలీసులు, మిలటరీ, నిత్వావరస వస్తువుల తరలింపునకు ప్రత్యేక రైళ్లు నడపడానికి కేంద్ర ప్రభుత్వం అనుమతించింది. కాగా, ఇలా వలస కార్మికుల కోసమే ఏర్పాటు చేసిన మొదటి రైలు ఇది కావడం విశేషం.   

రాష్ట్రంలోని కంది మండలం ఐఐటీలో పనిచేస్తున్న జార్ఖండ్‌ వలస కార్మికులు ఈ ప్రత్యేక రైలులో వారి స్వస్థలాలకు తరలి వెళ్లారు. ఐఐటీ భవన నిర్మాణంలో జార్ఖండ్‌, పశ్చిమబెంగాల్‌, బీహార్‌, ఒడిశాలకు చెందిన 2,464 మంది కార్మికులు పనిచేస్తున్నారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో తమను సొంత ప్రాంతాలకు వెళ్లనివ్వాలని గత రెండు రోజుల క్రితం ఆందోళన చేపట్టారు. దీంతో జార్ఖండ్‌కు చెందిన 1239 మంది కార్మికులను ప్రత్యేక రైలులో తరలించారు.


logo