శుక్రవారం 14 ఆగస్టు 2020
National - Jul 31, 2020 , 02:26:20

వ్యాక్సిన్‌ తొలుత ఎవరికి?

వ్యాక్సిన్‌ తొలుత ఎవరికి?

  • వైద్య, ఆరోగ్య సిబ్బందికి తొలి ప్రాధాన్యం 
  • ఆ తర్వాత వృద్ధులు, రోగులు, పేదలు.. 
  • అంతర్జాతీయ సింపోజియంలో అధికారుల వెల్లడి

న్యూఢిల్లీ, జూలై 30: కరోనా వ్యాక్సిన్‌ అందుబాటులోకి వచ్చిన తర్వాత తొలుత ఎవరికి ఇవ్వాలన్నదానిపై కేంద్రం మల్లగుల్లాలు పడుతున్నది. కరోనాపై పోరాటంలో ముందున్న వైద్య, ఆరోగ్య సిబ్బందికే తొలుత ఇవ్వాలన్నదానిపై దాదాపుగా ఏకాభిప్రాయం వ్యక్తమవుతున్నప్పటికీ.. ఆ తర్వాత క్రమంలో ఏయే వర్గాలకు ప్రాధాన్యం ఇవ్వాలన్న దానిపై చర్చలు నడుస్తున్నాయి. ‘కొవిడ్‌-19కు వ్యాక్సిన్‌ తయారుచేయటంలో నైతిక, వైజ్ఞానిక ఆలోచనలు’ అన్న అంశంపై గురువారం అంతర్జాతీయ సింపోజియంలో కేంద్ర ఆరోగ్యశాఖ ప్రత్యేక అధికారి రాజేశ్‌భూషణ్‌ మాట్లాడారు. వ్యాక్సిన్‌ పొందేందుకు ఎవరు అర్హులన్న అంశంపై తమకు అనేక వర్గాల నుంచి ప్రశ్నలు వస్తున్నాయని చెప్పారు. వైద్యసిబ్బంది తర్వాత వ్యాక్సిన్‌ను వృద్ధులకు ఇవ్వాలా? ఇతర అనారోగ్యాలు ఉన్నవారికి ఇవ్వాలా? పౌష్టికాహార లోపం కారణంగా రోగనిరోధక శక్తి తక్కువగా ఉండే పేదలకు ఇవ్వాలా? అన్న ప్రశ్నలు ఇప్పుడు భారత ప్రభుత్వం ముందు ఉన్నాయని చెప్పారు. వ్యాక్సిన్‌ తయారీలో నైతిక, సాంకేతిక విలువలను పాటిస్తున్నామని నీతి ఆయోగ్‌ సభ్యుడు వీకే పాల్‌ అన్నారు. వ్యాక్సిన్‌ అందుబాటులోకి వచ్చిన వెంటనే 1.వ్యాక్సిన్‌ ఎవరికి ఇవ్వాలి. 2. సరఫరా. 3. నిల్వ సౌకర్యాలు 4.వ్యాక్సిన్‌ వేసే వ్యక్తులకు శిక్షణ ఇవ్వటం. ప్రభుత్వం ముందు నాలుగు ప్రశ్నలు ఉంటాయని ఐసీఎమ్మార్‌ డైరెక్టర్‌ జనరల్‌ బల్‌రామ్‌ భార్గవ తెలిపారు. 


logo