మంగళవారం 01 డిసెంబర్ 2020
National - Oct 28, 2020 , 19:51:32

ఊహాగానాలతోనే సుశాంత్‌ సోదరిలపై రియా ఫిర్యాదు: సీబీఐ

ఊహాగానాలతోనే సుశాంత్‌ సోదరిలపై రియా ఫిర్యాదు: సీబీఐ

ముంబై: బాలీవుడ్‌ నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ మరణం కేసులో దర్యాప్తు చేస్తున్న సీబీఐ, రియా చక్రవర్తిని తప్పుపట్టింది. ఆమె ఊహాగానాలతోనే సుశాంత్‌ ఇద్దరు అక్కలపై కేసు నమోదు చేసినట్లు ఆరోపించింది. రియా తమపై నమోదు చేసిన కేసును కొట్టివేయాలంటూ సుశాంత్‌ సోదరిలు ప్రియాంక సింగ్, మీతు సింగ్‌ బాంబే హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్లకు సీబీఐ మద్దతు తెలిపింది. వారిద్దరిపై రియా చేస్తున్న ఆరోపణలు ఊహాగానాలని పేర్కొంది. దీని వల్ల కేసు దర్యాప్తు ప్రభావితమవుతుందని, ఇది మంచిది కాదని బుధవారం కోర్టుకు తెలిపింది. సుశాంత్‌ మరణానికి సంబంధించి ముంబై పోలీసులు లేదా రియా చక్రవర్తి వద్ద ఎలాంటి సమాచారం ఉన్నా తమతో పంచుకోవచ్చని చెప్పింది. సుశాంత్‌ అక్కలపై బాంద్రా పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదు అవసరం లేదని కోర్టుకు సీబీఐ తెలిపింది. 

జూన్‌ 14న బాంద్రాలోని తన నివాసంలో ఆత్మహత్య చేసుకున్న సుశాంత్‌ మరణం కేసులో అతడి ప్రియురాలైన రియా పలు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. డ్రగ్స్‌ కోణంలో దర్యాప్తు చేసిన ఎన్సీబీ ఆమెను అరెస్ట్‌ చేయగా సుమారు నెల రోజులు జైలులో ఉండి బెయిల్‌పై విడుదలయ్యారు. మరోవైపు సుశాంత్‌ మరణం వెనుక ఆయన అక్కలు ప్రియాంక సింగ్, మీతు సింగ్‌ ప్రమేయంపై తాను నమోదు చేసిన కేసును కొట్టివేయవద్దంటూ బాంబే హైకోర్టును మంగళవారం కోరారు. తప్పుడు ప్రిస్క్రిప్షన్లతో సుశాంత్‌కు ఒత్తిడి కలిగించే నిషేధిత ఔషధాలను ఇచ్చి ఆత్మహత్య చేసుకునేందుకు ప్రేరేపించారని ఆమె ఆరోపించారు. సుశాంత్‌ మరణానికి ఆరు రోజుల ముందు, జూన్‌ 8న సుశాంత్‌, తన సోదరి మధ్య జరిగిన వాట్సాప్‌ సంభాషణ ఆధారంగా గత నెలలో ప్రియాంక సింగ్, మీతు సింగ్‌పై బాంద్రా పోలీస్‌ స్టేషన్‌లో రియా ఫిర్యాదు చేశారు. సుశాంత్‌ మానసిక ఆరోగ్య పరిస్థితి గురించి అతడి కుటుంబానికి  ముందే తెలుసని అందులో పేర్కొన్నారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.