సోమవారం 23 నవంబర్ 2020
National - Nov 15, 2020 , 19:31:07

ఇలా చేస్తే ఆర్థిక విజయం మనదే...!

 ఇలా చేస్తే ఆర్థిక విజయం మనదే...!

హైదరాబాద్ : కరోనా కారణంగా ప్రపంచ దేశాల ఆర్ధిక వ్యవస్థలు తీవ్ర నష్టాల్లో కూరుకుపోయాయి. అన్ లాక్ తర్వాత ఇప్పుడిప్పుడే అన్ని రంగాలు కాస్త పుంజుకుంటున్నాయి. కోవిడ్ మహమ్మారి కారణంగా లెక్కనేనన్ని కష్టాలను చూస్తున్నాం.. ముఖ్యంగా చాలామంది ఆర్థికంగా దెబ్బతిన్నారు. గతంతో పోలిస్తే ఇప్పుడు ఉన్న డబ్బును ఎలా సర్దుబాటు చేసుకోవాలనే ఆలోచన బాగా పెరిగింది. అయితే మనం చేసే కొన్నిచిన్నపొరపాట్లను ఈ టైం లో కనుక అధిగమిస్తే ఆర్థిక విజయం మన సొంతం అవుతుంది. అందుకోసం వీటిని ఫాలో అవ్వండి...

 ప్రతి రూపాయికీ లెక్క... 

ప్రతి రూపాయికీ లెక్క చూసుకోవాలని మహమ్మారి మనకు నేర్పిన పాఠాల్లో ఒకటి. ప్రతి ఒక్కరూ కచ్చితంగా కుటుంబ బడ్జెట్‌ వేసుకోవాలి. పొదుపు కోసం కొంత మొత్తం కేటాయించిన తర్వాతే.. ఖర్చు చేయాలి. నిత్యావసరాలు, కోరికల మధ్య స్పష్టమైన వ్యత్యాసం ఉండేలా చూసుకోవాలి.

దీర్ఘకాలిక దృష్టి... 

వడ్డీ రేట్లు నేలచూపులు చూస్తున్నాయి. ఇవి ఇప్పుడిప్పుడే పెరగవు అని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై వచ్చే వడ్డీ తగ్గడంతో చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా పెద్దలకు ఇది నిరాశ కల్గిస్తున్నది. వారు దాచుకున్న సొమ్ముతో వచ్చే ఆదాయం వారి అవసరాలకు సరిపోవడం లేదు. దీన్నిబట్టి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఒకటుంది. ఎప్పుడూ స్థిరమైన రాబడి కోసం చూడొద్దు.. కాస్త నష్టభయం భరించగలిగితే.. ఈక్విటీ పెట్టుబడులు పరిశీలించవచ్చు. ముఖ్యంగా యువత దీర్ఘకాలిక దృష్టితో వీటిని ఎంచుకోవచ్చు. చాలామంది తమ పెట్టుబడులు ఒకేచోట పెడుతుంటారు. దీనివల్ల వారికి రావాల్సిన రాబడికన్నా తక్కువే వస్తుంది. ఉన్న డబ్బంతా బ్యాంకులోనే పెట్టారనుకోండి.. వడ్డీ రేట్లు తగ్గిన తరుణంలో వచ్చే ప్రతిఫలం కూడా తగ్గిపోతుంది. ఒకే బ్యాంకులో ఉంచడమూ పొరపాటే. ఉన్న డబ్బును వైవిధ్యమైన మార్గాల్లో పెట్టుబడులు పెట్టాలి.. దీనివల్ల నష్టభయం తగ్గుతుంది. రాబడీ కాస్త పెరుగుతుంది.

క్రెడిట్‌ కార్డులను వాడేటప్పుడు... 

చిన్న చిన్న అప్పులే మనల్ని ముంచేస్తాయి.. కొన్నిసార్లు ఇవి భారంగా కూడా మారతాయి. క్రెడిట్‌ కార్డులను వాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. పరిస్థితులన్నీ బాగున్నప్పుడు అప్పు సులభంగానే లభిస్తుంది. కష్టకాలంలో అధిక వడ్డీ ఉన్న రుణాలు మనల్ని మరింత అప్పుల ఊబిలోకి నెట్టేస్తాయి. కాబట్టి, అధిక వడ్డీ ఉండే రుణాల జోలికి వెళ్లకపోవడమే ఎప్పుడూ మంచిది. కార్డును ఎప్పుడూ.. గడువు చూసి వాడుకోండి.

3-6 నెలల అత్యవసర నిధి ఉండాలి...  

ఆర్థికంగా అత్యవసర పరిస్థితిలో ఉన్నాం. చేతిలో ఉన్న నగదు బంగారంతో సమానం. మీ దగ్గర అవసరాలకు సరిపోయే డబ్బు ఉంటేనే ఇప్పుడు నిబ్బరంగా ఉండగలరు. తాత్కాలికంగా ఆదాయం తగ్గినా.. పూర్తిగా ఆగిపోయినా ఎలా అనేది ఆలోచించుకోవాలి... ఇప్పటికైనా ఆలస్యం చేయకుండా.. కనీసం 3-6 నెలల అత్యవసర నిధిని జాగ్రత్తగా బ్యాంకు ఖాతాలో దాచుకోండి.

ఆరోగ్య బీమా అవసరం... 

కరోనా నేపథ్యంలో చాలామంది ఆసుపత్రిలో చేరారనీ, కుటుంబం మొత్తం అనారోగ్యంతో బాధపడుతున్నారని ఎక్కడో ఒక చోట వింటూనే ఉన్నాం. కరోనా వచ్చి మన కష్టార్జితాన్ని కరగదీయకుండా ఉండాలంటే.. ఒక పూర్తి స్థాయి ఆరోగ్య బీమా పాలసీతో మనం ఒక రక్షణ ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది. అనారోగ్యంలో మన దగ్గరున్న పొదుపు, స్నేహితులు, కుటుంబ సభ్యులు, విరాళాలూ మనల్ని ఆదుకోలేవు. ఆరోగ్య బీమా కలిగి ఉండాల్సిన అవసరమెంతైనా ఉన్నది. 

ఎప్పుడు ఏ రూపంలో మరణం మనల్ని కబళిస్తుందో అర్థం కాని పరిస్థితి. కరోనా ఒకవైపు.. వరదలు మరోవైపు.. ఇంటి నుంచి బయటకు వెళ్లిన వ్యక్తి.. తిరిగి ఇంటికొచ్చే వరకూ నమ్మకం ఉండటం లేదు. ఒక వ్యక్తికి ఏదైనా జరగరానిది జరిగితే.. ఆ కుటుంబానికి ఆర్థిక రక్షణ ఎలా? ఆలోచిస్తే.. ఆందోళన చెందడం తప్ప ఫలితం ఉండదు.. దీనికి బదులుగా.. మంచి చెల్లింపుల చరిత్ర ఉన్న బీమా సంస్థ నుంచి మీకు సరిపోయే మొత్తానికి టర్మ్‌ ఇన్సూరెన్స్‌ తీసుకోండి. 

అప్పుల విషయంలో జాగ్రత్త... 

లాక్‌డౌన్‌ మొదలయ్యాక చాలామంది తమ రుణ వాయిదాలను చెల్లించేందుకు ఇబ్బందిపడ్డారు. అదే సమయంలో ప్రభుత్వం మారటోరియాన్ని ప్రకటించింది. అదీ ఫిబ్రవరి 2020 వరకూ రుణవాయిదాలను క్రమం తప్పకుండా చెల్లించిన వారికే. ఇప్పుడు వడ్డీమీద వడ్డీని ప్రభుత్వం రద్దు చేసే ఆలోచనలో ఉంది. అంటే, రుణాన్ని క్రమం తప్పకుండా చెల్లించిన వారికి ఏదో ఒక విధంగా ఫలితం అందుతుందని భావించవచ్చు. వాయిదాల చెల్లింపుల్లో ఆలస్యం చేస్తూ.. రుణ చరిత్ర, క్రెడిట్‌ స్కోరు సరిగా లేకపోతే ఇబ్బందులు తప్పవు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.