సోమవారం 25 మే 2020
National - Mar 30, 2020 , 13:33:14

భ‌యం, ఆందోళ‌న‌.. వైర‌స్ క‌న్నా పెద్ద స‌మ‌స్య‌లు : సీజే బోబ్డే

భ‌యం, ఆందోళ‌న‌.. వైర‌స్ క‌న్నా పెద్ద స‌మ‌స్య‌లు :  సీజే బోబ్డే

హైద‌రాబాద్‌: క‌రోనా వైర‌స్ నేప‌థ్యంలో వ‌ల‌స కూలీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.  మ‌హాన‌గ‌రాల నుంచి త‌ర‌లివెళ్తున్న వారి దుస్థితి ద‌య‌నీయంగా ఉన్న‌ది.  ఈ నేప‌థ్యంలో ఇవాళ సుప్రీంకోర్టు ఓ పిటీష‌న్ స్వీక‌రించింది.  అడ్వ‌కేటు ఆలోక్ శ్రీవాత్స‌వ్ వేసిన ఆ పిటీష‌న్‌పై కోర్టు వాద‌న‌లు విన్న‌ది.  వ‌ల‌స కూలీల‌కు ఆహారం, నీరు, ర‌క్ష‌ణ క‌ల్పించాలంటూ శ్రీవాత్స‌వ‌న్ త‌న పిటిష‌న్‌లో కోరారు. కాలిన‌డ‌కన ఇండ్ల‌కు వెళ్తున్న‌వారికి అన్ని చ‌ర్య‌లు తీసుకోవాల‌ని శ్రీవాత్స‌వ్ సూచించారు.  అయితే ఈ పిటిష‌న్‌పై సుప్రీంకోర్టు వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారా విచార‌ణ చేప‌ట్టింది. 

వ‌ల‌స కూలీల‌ల వ్య‌ధ‌ల‌ను దూరం చేసేందుకు కేంద్ర ప్ర‌భుత్వంతో పాటు అన్ని రాష్ట్ర ప్ర‌భుత్వాలు కూడా ప‌క‌డ్బందీ చ‌ర్య‌లు తీసుకున్న‌ట్లు సోలిసిట‌ర్ జ‌న‌ర‌ల్ తుషార్ మెహ‌తా.. సుప్రీంకోర్టుకు వెల్ల‌డించారు. అడ్వ‌కేట్ శ్రీవాత్స‌వ్ పిటిష‌న్‌కు తాను అఫిడ‌విట్ దాఖ‌లు చేయాల‌నుకుంటున్న‌ట్లు కోర్టుకు తుషార్ తెలియ‌జేశారు. దీనిపై సీజేఐ బోబ్డే నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధ‌ర్మాసనం స్పందించింది. వ‌ల‌స కూలీల క్షేమం కోసం కేంద్రం ఏం చేస్తుందో తెలుసుకోవాల‌ని సీజే అన్నారు. భ‌యం, ఆందోళ‌న‌.. వైర‌స్ క‌న్నా పెద్ద స‌మ‌స్య‌లని తెలిపారు.logo