గురువారం 02 ఏప్రిల్ 2020
National - Feb 22, 2020 , 02:09:51

పాక్‌కు శరాఘాతం!

పాక్‌కు శరాఘాతం!
  • ఆ దేశాన్ని గ్రే లిస్ట్‌లోనే కొనసాగించాలని ఎఫ్‌ఏటీఎఫ్‌ నిర్ణయం
  • ఉగ్రనిధులను అడ్డుకోకపోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక
  • జూన్‌లోగా 27 అంశాల కార్యాచరణను పూర్తిచేయాలని స్పష్టీకరణ
  • ఐఎంఎఫ్‌, ప్రపంచబ్యాంకు నుంచి పాక్‌కు నిధుల రాక కష్టమే

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 21: పాకిస్థాన్‌ను ‘గ్రే’ జాబితాలోనే కొనసాగించాలని అంతర్జాతీయ ఉగ్రవాద నిధుల నిరోధక సంస్థ ‘ఫైనాన్షియల్‌ యాక్షన్‌ టాస్క్‌ ఫోర్స్‌' (ఎఫ్‌ఏటీఎఫ్‌) శుక్రవారం నిర్ణయించింది. ఉగ్రవాదులకు నిధుల చేరవేతలో ప్రమేయమున్న వారిని శిక్షించకపోతే కఠిన చర్యలు తప్పవని ఆ దేశాన్ని హెచ్చరించింది. ఫ్రాన్స్‌ రాజధాని పారిస్‌లో వారం రోజులుగా జరుగుతున్న ఎఫ్‌ఏటీఎఫ్‌ ప్లీనరీ సమావేశాలు శుక్రవారం ముగిశాయి. లష్కరే తాయిబా, జైషే మహమ్మద్‌, హిజ్బుల్‌ ముజాహిదీన్‌ వంటి ఉగ్రవాద సంస్థలకు నిధులు అందకుండా నియంత్రించేందుకు తాము నిర్దేశించిన 27 కార్యాచరణ అంశాల్లో పాకిస్థాన్‌ కేవలం 14 అంశాలనే అమలుచేసిందని ఎఫ్‌ఏటీఎఫ్‌ పేర్కొంది. పాక్‌కు ఇచ్చిన అన్ని గడువులు ముగిశాయని, అయినప్పటికీ కార్యాచరణ ప్రణాళికను అమలు చేయడంలో ఆ దేశం విఫలమైందని తెలిపింది. ఈ ఏడాది జూన్‌లోగా కార్యాచరణను పూర్తిచేయకపోతే కఠిన చర్యలు తప్పవని ఒక ప్రకటనలో హెచ్చరించింది. పాక్‌తో వాణిజ్య సంబంధాలు, లావాదేవీలపై ప్రత్యేక దృష్టిసారించాలని సభ్యదేశాలు తమ ఆర్థిక సంస్థలకు తెలియజేయాలని సూచించింది. 


ఇలాగే వ్యవహరిస్తే బ్లాక్‌ లిస్ట్‌ చేరే ప్రమాదం..

ఎఫ్‌ఏటీఎఫ్‌ నిర్ణయం నేపథ్యంలో అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్‌), ప్రపంచబ్యాంక్‌, యూరోపియన్‌ యూనియన్‌ (ఈయూ) తదితర సంస్థల నుంచి నిధులు పొందడం పాకిస్థాన్‌కు కష్టతరమవుతుంది. ఇప్పటికే ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన ఆ దేశానికి ఇది శరాఘాతంగా మారనుంది. ఎఫ్‌ఏటీఎఫ్‌ ఆదేశాలను అనుసరించకపోతే ఉత్తరకొరియా, ఇరాన్‌ మాదిరిగా పాక్‌ కూడా ‘బ్లాక్‌' లిస్ట్‌లో చేరే పరిస్థితిని ఎదుర్కోవాల్సి ఉంటుంది. మలేషియా నుంచి గట్టి మద్దతు లభించినప్పటికీ, ఇతర పశ్చిమ దేశాల మద్దతు పొందడంలో పాక్‌ విఫలమైంది. 39 సభ్యదేశాలు గల ఎఫ్‌ఏటీఏలో పాక్‌ గ్రే లిస్ట్‌ నుంచి బయటపడేందుకు ఆ దేశానికి 12 దేశాల మద్దతు అవసరం. బ్లాక్‌ లిస్ట్‌లో చేరకుండా ఉండాలంటే కనీసం మూడు దేశాలు మద్దతివ్వాలి. గతేడాది అక్టోబర్‌లో జరిగిన సమావేశాల్లో చైనాతోపాటు మలేషియా, టర్కీ మద్దతివ్వడంతో బ్లాక్‌ లిస్ట్‌లో చేరే ప్రమాదం నుంచి పాక్‌ గట్టెక్కింది. లష్కరే తాయిబా, హిజ్బుల్‌ ముజాహిదీన్‌, జైషే మహమ్మద్‌ వంటి ఉగ్రవాద సంస్థలకు పాక్‌ మద్దతునిస్తున్నదని, ఆ దేశంపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎఫ్‌ఏటీఎఫ్‌ను భారత్‌ ముందు నుంచీ కోరుతున్నది.


 పాక్‌ను గ్రే లిస్ట్‌లోనే కొనసాగించాలని మూడు రోజుల కిందట ఎఫ్‌ఏటీఎఫ్‌ ఉపసంఘం సిఫార్సు చేసిన సంగతి తెలిసిందే. లష్కరే తాయిబా ఉగ్రసంస్థ వ్యవస్థాపకుడు, ముంబై పేలుళ్ల సూత్రధారి హఫీజ్‌ సయీద్‌కు పాకిస్థాన్‌లోని ఉగ్రవాద వ్యతిరేక కోర్టు 11 ఏండ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించిన వారం రోజులకే ఎఫ్‌ఏటీఎఫ్‌ సమావేశాలు జరిగాయి. ఎఫ్‌ఏటీఎఫ్‌ని, ఇతర సభ్యదేశాలను ప్రసన్నం చేసుకునేందుకే పాక్‌ ఆ నిర్ణయం తీసుకున్నట్లు అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. మరో ఉగ్రవాది, జైషే మహమ్మద్‌ స్థాపకుడు మసూద్‌ అజర్‌, అతడి కుటుంబ సభ్యుల ఆచూకీ కనిపించడం లేదని పాక్‌ ఇటీవలే ఎఫ్‌ఏటీఎఫ్‌కు సమాచారమిచ్చింది. ఐక్యరాజ్యసమితి ఉగ్రవాదులుగా ముద్రవేసిన 16 మందిలో ఏడుగురు ఇప్పటికే మరణించారని, మిగిలిన వారిలో ఏడుగురు తమను ఆ జాబితా నుంచి తొలిగించాలని ఐరాసకు దరఖాస్తు చేసుకున్నారని వివరించింది. ఉగ్రవాదులకు నిధుల చేరవేతను అడ్డుకునేందుకు 1989లో ఎఫ్‌ఏటీఎఫ్‌ ఏర్పాటైంది. పారిస్‌ కేంద్రంగా ఇది పనిచేస్తున్నది.


logo
>>>>>>