శుక్రవారం 03 జూలై 2020
National - Jun 15, 2020 , 01:27:45

భారత్‌లోకే ఆక్రమిత కశ్మీర్‌

భారత్‌లోకే ఆక్రమిత కశ్మీర్‌

  • ఐదేండ్లలో మారనున్న కశ్మీర్‌ ముఖచిత్రం 
  • దాంతో పీవోకే ప్రజలచూపు భారత్‌ వైపు
  • పార్లమెంటు తీర్మానంతో వారి కలలు నిజం
  • భవిష్యత్తు పరిణామానికి ఎదురుచూడండి
  • కేంద్ర రక్షణమంత్రి రాజ్‌నాథ్‌ సంచలన వ్యాఖ్య

న్యూఢిల్లీ: రాబోయే ఐదేండ్లలో చేపట్టే అభివృద్ధి కార్యక్రమాలతో జమ్ముకశ్మీర్‌ ముఖచిత్రాన్నే మార్చనున్నామని కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ అన్నారు. ఆ అభివృద్ధిని చూసి పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌(పీవోకే) ప్రజలు కూడా భారత్‌లో భాగస్వాములైతే బాగుంటుందని కలలు కంటారని చెప్పారు. ప్రజలు అలా కోరుకున్న మరుక్షణం పార్లమెంటు తీర్మానం ద్వారా వారి కలలను నిజం చేస్తామన్నారు. ఆదివారం ఆయన జమ్ముకశ్మీర్‌లో వర్చువల్‌ జనసంవాద్‌ ర్యాలీలో పాల్గొన్నారు. తీర్మానం తర్వాత పీవోకే కూడా భారత్‌లో అంతర్భాగం అవుతుందన్నారు. ‘జమ్ముకశ్మీర్‌ అభివృద్ధే మా మొదటి ప్రాధాన్య అంశమని చెప్పడంలో మేం విజయవంతమయ్యాం. ఐదేండ్లలో రూ.2 లక్షల కోట్లు ఖర్చు చేశాం. కేంద్రీయ వర్సిటీలు, ఎయిమ్స్‌ స్థాపించాం. రాబోయే ఐదేండ్లలో జమ్మూకశ్మీర్‌ ముఖచిత్రం మారుతుంది. పీవోకే వాళ్లు ఇండియాలో చేరాక వారి తలరాత కూడా మారుతుంది. 

భవిష్యత్తులో జరిగేదాని కోసం ఎదురుచూడండి’ అని అన్నారు. పీవోకే భారత్‌లో అంతర్భాగమని పార్లమెంటు ఇప్పటికే తీర్మానం చేసిన విషయం తెలిసిందే. ఆర్టికల్‌ 370 నిర్వీర్యం సందర్భంగా అక్సాయ్‌చిన్‌, పీవోకేలను కూడా స్వాధీనం చేసుకుంటామన్న కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా మాటలను రాజ్‌నాథ్‌ ఈ సందర్భంగా గుర్తు చేశారు. జాతిగౌరవం విషయంలో భారత్‌ ఎప్పటికీ రాజీ పడబోదని స్పష్టంచేశారు. లడఖ్‌ సరిహద్దు వద్ద చైనాతో నెలకొన్న ప్రతిష్టంభన నేపథ్యంలో ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు. సరిహద్దు వివాదాలపై దాచిపెట్టాల్సింది ఏమీ లేదని, సమయం వచ్చినప్పుడు పార్లమెంట్‌ వేదికగా వివరిస్తామని ఆయన అన్నారు. చర్చలతో సమస్యను పరిష్కరించుకుందామని చైనా అభిప్రాయపడిందని, భారత్‌ కూడా అదే కోణంలో ఆలోచిస్తున్నదని చెప్పారు. 


logo