శనివారం 26 సెప్టెంబర్ 2020
National - Aug 04, 2020 , 22:06:44

‘కొవిడ్‌’ మరణాల రేటు తగ్గింది..: కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ

‘కొవిడ్‌’ మరణాల రేటు తగ్గింది..: కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ

న్యూ ఢిల్లీ: దేశంలో కరోనా మరణాల రేటులో తగ్గుదల కనిపిస్తున్నదని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. తొలి లాక్​డౌన్​ తర్వాత మొదటిసారిగా కొవిడ్‌ మరణాల రేటు అత్యల్పస్థాయికి చేరుకుందని పేర్కొంది. తొలిసారి అత్యల్పంగా 2.10 శాతంగా నమోదైందని వెల్లడించింది.

‘దేశంలో కొవిడ్‌ మరణాల రేటు క్రమక్రమంగా తగ్గుతోంది. ఇదే కొనసాగుతున్నది. కరోనా క్రియాశీల కేసుల కంటే కోలుకున్నవారి సంఖ్య పెరుగుతోంది. ఇది మంచి పరిణామం.’ అని ఆరోగ్య మంత్రిత్వ శాఖ కార్యదర్శి రాజేశ్‌ భూషణ్​ వెల్లడించారు. మరణాల్లోనూ సగానికిపైగా 60 ఏళ్లపైబడిన వారే ఉన్నారని వెల్లడించారు. 37 శాతం మరణాల్లో 45 నుంచి 60 ఏళ్ల మధ్య వయస్సున్నవారు ఉన్నారని వివరించారు. క్రియాశీల కేసులకంటే కరోనా నుంచి కోరుకున్న వారి సంఖ్య రెట్టింపైందని రాజేశ్‌ భూషణ్‌ వెల్లడించారు. 

దేశంలో ప్రస్తుతం పాజిటివిటీ​ రేటు 8.89 శాతంగా ఉందన్నారు. పంజాబ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్​, ఉత్తర​ప్రదేశ్​, హర్యానా, అసోం, పశ్చిమ బెంగాల్‌​, కర్ణాటక రాష్ట్రాల్లో 10 శాతం కన్నా తక్కువే ఉందని వెల్లడించారు. కొన్ని రాష్ట్రాల్లో కేసుల సంఖ్య పెరుగుతున్నదని చెప్పారు. దేశంలో ప్రస్తుతం 5,86,298 యాక్టివ్ కేసులున్నాయని, 12లక్షల మందికిపైగా కొవిడ్​​ నుంచి కోలుకున్నారని వివరించారు. ఆర్​టీ పీసీఆర్​, రాపిడ్​ యాంటీజెన్​ పరీక్షల నిర్వహణలో రాష్ట్రాలు వేగం పుంజుకున్నాయని ఆయన తెలిపారు. ప్రతీ 10 లక్షల జనాభాలో రోజుకు 140 మందికి పరీక్షలు జరుగుతున్నాయని, వీటిలో గోవా, దిల్లీ, త్రిపుర, తమిళనాడు ముందంజలో ఉన్నాయన్నారు. గడిచిన 24 గంటల్లో 6.6 లక్షల మందికి కరోనా పరీక్షలు జరిగాయని, దీంతో దేశంలో ఇప్పటివరకు 2 కోట్ల మందికిపైగా కొవిడ్​ టెస్టులు పూర్తయ్యాయని వివరించారు. మేకిన్‌ ఇండియా వెంటిలేటర్లు క్రియాశీలక పాత్ర పోషిస్తున్నాయని, ఇవి వెంటిలేటర్ల కొరతను తీరుస్తున్నాయని చెప్పారు. 


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo