బుధవారం 01 ఏప్రిల్ 2020
National - Mar 18, 2020 , 02:51:42

కరోనా ఘంటికలు

కరోనా ఘంటికలు

-137కు పెరిగిన బాధితులు 

-వైరస్‌తో మరొకరు మృత్యువాత.. దేశంలో మూడుకు చేరిన మరణాలు

-ఆఫ్ఘనిస్థాన్‌, ఫిలిప్పీన్స్‌, మలేసియా ప్రయాణికులపైనా నిషేధం

-మహారాష్ట్రలో వేగంగా వ్యాపిస్తున్న వైరస్‌

-పార్లమెంట్‌ సమావేశాలు కుదించబోమన్న ప్రధాని మోదీ

న్యూఢిల్లీ/ముంబై, మార్చి 17: కరోనా మహమ్మారి భారత్‌లోనూ పంజా విసురుతున్నది. ఈ వైరస్‌ బారిన పడి దేశంలో మరొకరు మృత్యువాతపడ్డారు. ముంబైకి చెందిన 63 ఏండ్ల వృద్ధుడు మంగళవారం ప్రాణాలు కోల్పోయారు. దీంతో మృతుల సంఖ్య మూడుకు చేరుకున్నది. మరోవైపు, దేశంలో కరోనా బాధితుల సంఖ్య 137కు పెరిగినట్లు కేంద్ర వైద్య శాఖ వెల్లడించింది. ఇందులో 24 మంది విదేశీయులని తెలిపింది. యూరోపియన్‌ యూనియన్‌ (ఈయూ), టర్కీ, బ్రిటన్‌ నుంచి వచ్చే ప్రయాణికులపై ఈ నెలాఖరు వరకు నిషేధం విధిస్తూ సోమవారం ఆదేశాలు జారీ చేసిన కేంద్రం.. తాజాగా ఆఫ్ఘనిస్థాన్‌, మలేసియా, ఫిలిప్పీన్స్‌ను కూడా ఆ జాబితాలో చేర్చింది. 


ఒక్క మహారాష్ట్రలోనే 39 కేసులు..

మహారాష్ట్రలో వైరస్‌ వేగంగా వ్యాపిస్తున్నది. దేశంలోనే అత్యధికంగా ఆ రాష్ట్రంలో 39 కరోనా కేసులు నమోదయ్యాయి. మంగళవారం మృతిచెందిన ముంబై వాసి ఇటీవలే దుబాయ్‌ నుంచి తిరిగొచ్చినట్లు అధికారులు తెలిపారు. ఆయన భార్యకు కూడా కరోనా నిర్ధారణ అయిందని, ఆమె పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని చెప్పారు.  దేశంలో ఇప్పటికే కర్ణాటకలో ఒకరు, ఢిల్లీలో మరొకరు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఇప్పటివరకు 13 మందిని డిశ్చార్జి చేసినట్లు అధికారులు తెలిపారు. 


కరోనాపై అవగాహన పెంచండి: ప్రధాని

కరోనా వైరస్‌పై ప్రజల్లో అవగాహన పెంచాలని బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ సూచించారు. మంగళవారం బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలను కుదించే ప్రసక్తే లేదని స్పష్టంచేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఎంపీలు తమ విధులను నిర్వర్తించాల్సిన అవసరం ఉందన్నారు. వైద్యులు, వైద్య సిబ్బంది, ఎయిర్‌లైన్స్‌ సిబ్బంది.. కరోనా వైరస్‌పై అలుపెరుగని పోరాటం సాగిస్తున్నారని ప్రశంసించారు. మరోవైపు, అన్ని ప్రభుత్వ కార్యాలయాల ముందు థర్మల్‌ స్కానర్లు ఏర్పాటు చేయాలని కేంద్ర సిబ్బంది, శిక్షణ విభాగం అన్ని మంత్రిత్వ శాఖలకు ఆదేశాలు జారీచేసింది. అలాగే తక్షణమే తాత్కాలిక, సందర్శకుల పాస్‌లను నిలిపివేయాలని సూచించింది. అనవరసర ప్రయాణాలు మానుకోవాలని, సమావేశాలను సాధ్యమై-నంతవరకు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా నిర్వహించాలని సూచించింది. 


logo
>>>>>>