శనివారం 29 ఫిబ్రవరి 2020
ఉసేన్‌ బోల్ట్‌ను తలదన్నాడు

ఉసేన్‌ బోల్ట్‌ను తలదన్నాడు

Feb 15, 2020 , 02:27:51
PRINT
ఉసేన్‌ బోల్ట్‌ను తలదన్నాడు
  • రికార్డును బద్దలు కొట్టిన కన్నడిగుడు
  • 9.55 సెకండ్ల్లలో 100 మీటర్లు పరుగెత్తిన శ్రీనివాస గౌడ

బెంగళూరు: ప్రపంచంలో అత్యంత వేగంగా పరుగెత్తే క్రీడాకారుడిగా జమైకాకు చెందిన ఉసేన్‌ బోల్ట్‌కు పేరుంది. 100 మీటర్ల దూరాన్ని కేవలం 9.58 సెకండ్లలో పూర్తి చేసి బోల్ట్‌ రన్నింగ్‌లో ప్రపంచ రికార్డు సృష్టించాడు. అయితే బోల్ట్‌ రికార్డును తలదన్నుతూ కర్ణాటకకు చెందిన శ్రీనివాస గౌడ(28) అనే గ్రామస్థుడు దున్నపోతులతో రన్నింగ్‌ చేసి సంచలనం సృష్టించాడు. కర్ణాటకలోని ఉడుపి, మంగళూరులో దున్నపోతులతో పరుగు పోటీలు(కంబల) నిర్వహిస్తుంటారు. బురద నేలల్లో ఈ క్రీడను నిర్వహిస్తారు. శ్రీనివాస గౌడ తన రెండు దున్నపోతులతో పరుగెత్తుతూ.. 142.50 మీటర్ల దూరాన్ని కేవలం 13.62 సెకండ్లలో చేరుకున్నాడు. అంటే 100 మీటర్లను కేవలం 9.55 సెకండ్ల్లలో చేరుకుని బోల్ట్‌ కంటే మెరుగ్గా (0.03సెకండ్ల కంటే ముందుగా) పరుగెత్తాడు. ఈ సందర్భంగా శ్రీనివాస గౌడ మాట్లాడుతూ.. ఈ విజయం తన దున్నపోతుల వల్లే సాధ్యమైందని తెలిపాడు. కాగా దున్నపోతుల సాయంతో పరుగెత్తడం వల్లే శ్రీనివాస గౌడ తక్కువ సమయంలో గమ్యాన్ని చేరుకున్నాడని కొందరు నెటిజన్లు వాదిస్తుంటే, బురద నేలల్లో అత్యంత వేగంగా పరుగెత్తిన అతడికి ఒలింపిక్‌ క్రీడల్లో  పాల్గొనేలా తర్ఫీదునివ్వాలని మరికొందరు సలహానిస్తున్నారు.


logo