సోమవారం 30 మార్చి 2020
National - Feb 13, 2020 , 02:46:17

ఈ నెల 15-29 వరకు ఫాస్టాగ్‌ ఉచితం

ఈ నెల 15-29 వరకు ఫాస్టాగ్‌ ఉచితం

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 12: జాతీయ రహదారుల్లోని టోల్‌ గేట్ల వద్ద ఎలక్ట్రానిక్‌ చెల్లింపుల కోసం ఇటీవల ప్రవేశపెట్టిన ఫాస్టాగ్‌ను 15 రోజుల పాటు ఉచితంగా పొందవచ్చని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఎలక్ట్రానిక్‌ టోల్‌ వసూళ్లను మరింత పెంచే లక్ష్యంగా నేషనల్‌ హైవేస్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఎన్‌హెచ్‌ఏఐ) ఈ మేరకు నిర్ణయించినట్లు కేంద్ర రోడ్డు రవాణా మంత్రిత్వశాఖ బుధవారం పేర్కొంది. ఎన్‌హెచ్‌ఏఐ ఫాస్టాగ్‌ కోసం చెల్లించాల్సి రూ. 100 రుసుమును ఫిబ్రవరి 15 నుంచి 29 వరకు మాఫీ చేయనున్నట్లు వెల్లడించింది. 


సరైన వాహన ధ్రువీకరణ పత్రం (ఆర్సీ)తో ఆధీకృత టోల్‌ ప్లాజాలు, ప్రాంతీయ రవాణా కార్యాలయాలు, సేవా కేంద్రాలు, పెట్రోలు బంకులు వంటి చోట్ల ఫాస్టాగ్‌ను ఉచితంగా పొందవచ్చని తెలిపింది. ఫాస్టాగ్‌ వ్యవస్థ అందుబాటులోకి వచ్చాక టోల్‌గేట్ల వద్ద ఎలక్ట్రానిక్‌ వసూళ్లు బాగా పెరిగాయని, గతంలో రూ.68 కోట్లుగా ఉన్న రోజువారీ ఆదాయం రూ.87 కోట్లకు చేరిందని కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ గత నెలలో వెల్లడించారు. ఈ వ్యవస్థ పూర్తిగా ఆచరణలోకి వస్తే ఎన్‌హెచ్‌ఏఐ రోజువారీ ఆదాయం వంద కోట్లు దాటుతుందని అంచనా వేశారు.


logo