శుక్రవారం 15 జనవరి 2021
National - Dec 21, 2020 , 02:14:07

ఫాస్టాగ్‌ తప్పనిసరి

ఫాస్టాగ్‌ తప్పనిసరి

  • కాంటాక్ట్‌లెస్‌ కార్డు  చెల్లింపుల పరిమితి పెంపు
  • చెక్‌ మోసాల కట్టడికి పాజిటివ్‌ పే సిస్టమ్‌
  • కొత్త ఏడాదిలో కొత్త నిబంధనలు

న్యూఢిల్లీ, డిసెంబర్‌ 20: వచ్చే ఏడాది జనవరి 1 నుంచి ఫాస్టాగ్‌ తప్పనిసరి కానుంది. అలాగే ల్యాండ్‌ లైన్‌ నుంచి మొబైల్‌కు కాల్‌ చేసేటప్పుడు ముందుగా  ‘0’ను డయల్‌ చేయాల్సి ఉంటుంది. ఈ మేరకు కొత్త సంవత్సరంలో పలు కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి. జనవరి 1 నుంచి అమలు కానున్న ఆ నిబంధనలేంటో చూద్దాం..

ఫాస్టాగ్‌ మస్ట్‌

జనవరి 1 నుంచి ఫాస్టాగ్‌ తప్పనిసరి చేస్తూ కేంద్ర రోడ్డు రవాణా శాఖ ఇప్పటికే నోటిఫికేషన్‌ జారీచేసింది. అన్ని ఫోర్‌ వీలర్లకు ఇది వర్తిస్తుంది. ఈ మేరకు సెంట్రల్‌ మోటార్‌ వెహికల్స్‌ రూల్స్‌-1989లో సవరణలు చేశారు.

పాజిటివ్‌ పే సిస్టమ్‌

బ్యాంకు చెక్‌ మోసాలను అరికట్టేందుకు ఆర్బీఐ జనవరి 1 నుంచి పాజిటివ్‌ పే సిస్టమ్‌ను అమలుచేయాలని నిర్ణయించింది.  రూ.50వేలు దాటిన చెల్లింపులకు కీలక వివరాలను మరోసారి ధ్రువపరుచుకోవాల్సి ఉంటుంది. 

కాంటాక్ట్‌లెస్‌ కార్డు లావాదేవీల పెంపు

కాంటాక్ట్‌లెస్‌ కార్డు చెల్లింపుల పరిమితిని రూ.2000 నుంచి రూ.5000కు పెంచుతూ ఆర్బీఐ నిర్ణయం తీసుకున్నది. ఈ నిబంధన జనవరి 1 నుంచి అమల్లోకి రానుంది. 

జీఎస్టీ రిటర్న్స్‌

చిన్నతరహా వ్యాపారులు జీఎస్టీ రిటర్నులు దాఖలు చేయడాన్ని కేంద్రం సులభతరం చేసింది. ఇకపై మూడు నెలలకొకసారి వీరు రిటర్నులు ఫైల్‌ చేయవచ్చు. రూ.5 కోట్లలోపు వార్షిక టర్నోవర్‌ ఉన్న సంస్థలకు ఇది వర్తిస్తుంది. 

ముందు ‘0’ డయల్‌..

ల్యాండ్‌లైన్‌ నుంచి మొబైల్‌కు కాల్‌ చేసేటప్పుడు నంబర్‌కు ముందు ‘0’ ఎంటర్‌ చేయడాన్ని టెలికం శాఖ తప్పనిసరి చేసింది. ఇందుకు ఏర్పాట్లు చేసుకోవాలని టెల్కోలకు సూచించింది. జనవరి 15 నుంచి ఇది అమల్లోకి రానుంది.