ఆదివారం 29 మార్చి 2020
National - Mar 14, 2020 , 01:49:40

ఫరూఖ్‌కు విముక్తి

ఫరూఖ్‌కు విముక్తి
  • ఏడు నెలల అనంతరం విడుదలైన ఎన్సీ అధినేత
  • ఆయనపై నమోదు చేసిన పీఎస్‌ఏను ఎత్తేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటన
  • మిగతా వాళ్లు విడుదలైన తర్వాతే భవిష్యత్‌పై ప్రకటన: ఫరూఖ్‌

శ్రీనగర్‌, మార్చి 13: జమ్ముకశ్మీర్‌ మాజీ ముఖ్యమంత్రి, నేషనల్‌ కాన్ఫరెన్స్‌(ఎన్సీ) అధినేత ఫరూఖ్‌ అబ్దుల్లా గృహ నిర్బంధం నుంచి విడుదలయ్యారు. ఫరూఖ్‌పై ప్రయోగించిన ప్రజా భద్రతా చట్టాన్ని(పీఎస్‌ఏ) ప్రభుత్వం ఉపసంహరించడంతో ఏడు నెలలపాటు నిర్బంధంలో గడిపిన ఆయన శుక్రవారం విడుదలయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఫరూఖ్‌ నిర్బంధంలో ఉన్న తన కుమారుడు, జమ్ముకశ్మీర్‌ మాజీ సీఎం ఓమర్‌ అబ్దుల్లా, పీడీపీ అధినేత్రి మెహబూబా ముఫ్తీ, ఇతర రాజకీయ నాయకుల్ని కూడా ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తినిచ్చే ఆర్టికల్‌ 370ని కేంద్ర ప్రభుత్వం రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఫరూఖ్‌ను అధికారులు గతేడాది అగస్టు 5న గృహనిర్బంధంలోకి తీసుకున్నారు. తదనంతరం సెప్టెంబర్‌ 15న ఆయనపై పీఎస్‌ఏను ప్రయోగించారు. డిసెంబర్‌ 13న దానిని మరో మూడు నెలల పాటు పొడిగించారు. శుక్రవారం అర్ధరాత్రితో ఆ గడువు తీరిపోయింది. దీంతో ఆయనపై మరో మూడు మాసాల పాటు పీఎస్‌ఏను పొడిగిస్తున్నట్టు బుధవారం అధికారులు తెలిపారు. అయితే, ఆయనపై ఉన్న ప్రజా భద్రతా చట్టాన్ని ఎత్తివేస్తున్నట్టు ప్రభుత్వం శుక్రవారం మధ్యాహ్నం ప్రకటించింది. కాగా ఓమర్‌ అబ్దుల్లా, జమ్ముకశ్మీర్‌ మాజీ సీఎం మెహబూబ్‌ ముఫ్తీపై ఈ ఏడాది ఫిబ్రవరి 6న ప్రభుత్వం పీఎస్‌ఏను ప్రయోగించింది. అంతకు ముందు ఆరు నెలలుగా వాళ్లిద్దరూ నిర్బంధంలో ఉన్నారు. ఫరూఖ్‌ను విడుదల చేయడాన్ని వివిధ రాజకీయ పార్టీ నేతలు స్వాగతించారు. 


అప్పటి వరకూ మాట్లాడను

220 రోజుల గృహ నిర్బంధం అనంతరం శుక్రవారం విడుదలైన 82 ఏండ్ల ఫరూఖ్‌ అబ్దుల్లా  మీడియాతో మాట్లాడారు. నిర్బంధంలో ఉన్న మిగతా నాయకులందరూ విడుదలైన తర్వాతే తాను భవిష్యత్‌ కార్యాచరణపై నిర్ణయం తీసుకుంటానన్నారు.


logo