బుధవారం 02 డిసెంబర్ 2020
National - Oct 14, 2020 , 15:59:31

నిర్బంధం నుంచి విడుదలైన ముఫ్తితో ఫరూక్‌, ఒమర్‌ భేటీ

నిర్బంధం నుంచి విడుదలైన ముఫ్తితో ఫరూక్‌, ఒమర్‌ భేటీ

శ్రీనగర్‌: ఏడాదిపైగా గృహ నిర్బంధంలో ఉండి మంగళవారం రాత్రి విడుదలైన జమ్ముకశ్మీర్‌ మాజీ ముఖ్యమంత్రి, పీపుల్స్‌ డెమోక్రటిక్‌ పార్టీ (పీడీపీ) అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీని, మాజీ సీఎంలు, నేషనల్‌ కాన్ఫరెన్స్‌ (ఎన్సీ) అధ్యక్షుడు ఫరూక్‌ అబ్దుల్లా, ఆయన కుమారుడు ఒమర్‌ అబ్దుల్లా కలిశారు. బుధవారం ఉదయం ముఫ్తీ నివాసానికి వెళ్లిన వీరిద్దరు ఆమెతో సమావేశమయ్యారు. సుమారు 14 నెలలపాటు గృహ నిర్బంధంలో ఉండి విడుదలైన ముఫ్తీని ఫరూక్‌, ఒమర్‌ పరామర్శించారు. జమ్ముకశ్మీర్‌లో ప్రస్తుత పరిస్థితులపై వారు చర్చించారు. 

జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్‌ 370ను కేంద్ర ప్రభుత్వం గతేడాది ఆగస్టు 5న రద్దు చేయడంతోపాటు ఆ రాష్ట్రాన్ని జమ్ముకశ్మీర్‌, లఢక్‌ కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించింది. ఈ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా ముఫ్తీ, ఫరూక్‌ అబ్దుల్లా, ఆయన కుమారుడు ఒమర్‌ అబ్దుల్లాతోపాటు ఆ రాష్ట్రానికి చెందిన పలువురు రాజకీయ నేతలను నిర్బంధంలో ఉంచింది. ప్రజా భద్రత చట్టం (పీఎస్‌ఏ) కింద ఫరూక్‌, ఒమర్‌ను సుమారు ఏడాది పాటు గృహ నిర్బంధంలో ఉంచిన కేంద్ర ప్రభుత్వం రెండు నెలల కిందట వారిని విడుదల చేసింది. 

అయితే ప్రజా భద్రతా చట్టం కింద ముఫ్తీ గృహ నిర్బంధాన్ని మరో ఆరు నెలలపాటు పొడిగించింది. దీంతో ఆమె కుమార్తె ఇల్తిజా సుప్రీంకోర్టులో హెబియస్‌ కార్పస్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. గత నెలలో ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన అత్యున్నత ధర్మాసనం మెహబూబా ముఫ్తీని ఇంకెంత కాలం నిర్బంధంలో ఉంచుతారని కేంద్రాన్ని, జమ్ముకశ్మీర్‌ పరిపాలన అధికారులను ప్రశ్నించింది. దీనిపై ఒక నిర్ణయం తీసుకుంటామని కోర్టుకు ప్రభుత్వం తెలిపింది. ఈ నేపథ్యంలో మంగళవారం రాత్రి 9.45 గంటలకు ముఫ్తీని గృహ నిర్బంధం నుంచి విడుదల చేశారు. ఆమె కుమార్తె ఇల్తిజా ముఫ్తీ ఈ విషయాన్ని ట్విట్టర్‌లో వెల్లడించారు. 


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలం­గాణ ఆండ్రా­యిడ్ యాప్ డౌన్­లోడ్ చేసు­కోండి