బుధవారం 27 జనవరి 2021
National - Dec 21, 2020 , 02:31:24

నేడు రైతుల నిరశన

నేడు రైతుల నిరశన

  • నేడు నిరాహార దీక్ష
  • 29 మంది అమర కర్షకులకు నివాళి
  • 25 నుంచి 27 వరకు టోల్‌ నిలిపివేత
  • ఢిల్లీ సరిహద్దుల్లో  రైతు నేతల నిర్ణయం
  • రైతు సంఘాలకు విరాళాలపై బ్యాంకుల దృష్టి
  • అనుమతులు ఉండాలని హెచ్చరికలు
  • ఎంతమందిపై ఐటీ దాడులు చేస్తారు: కేజ్రీవాల్‌
  • పంజాబ్‌లో మరో రైతు ఆత్మహత్య

న్యూఢిల్లీ: కేంద్రం తీసుకొచ్చిన వివాదాస్పద వ్యవసాయ చట్టాల రద్దుకై ఢిల్లీ సరిహద్దుల్లో రైతుల నిరసనోద్యమం నిరాఘాటంగా కొనసాగుతున్నది. చలి అంతకంతకూ తీవ్రమవుతున్నా రైతులు వెనక్కి తగ్గడం లేదు. నిరసనల 25వ రోజు ఆదివారం రైతులు ‘శ్రద్ధాంజలి దినం’గా పాటించారు. ఉద్యమంలో పాల్గొంటూ ప్రాణాలు కోల్పోయిన 29 మంది కర్షకులకు నివాళులర్పించారు. సోమవారం నిరాహార దీక్ష చేపట్టాలని నిర్ణయించారు. ఈ నెల 25  నుంచి 27 వరకు హర్యానాలో జాతీయ రహదారులపై టోల్‌ వసూలును నిలిపివేయిస్తామని ప్రకటించారు. ఈ నెల 23న కిసాన్‌ దివస్‌ జరుపుతామని, ఆ రోజు మధ్యాహ్నం వంట వండుకోకుండా నిరసన తెలియజేయాలని ప్రజలకు రైతు నేతలు విజ్ఞప్తి చేశారు. మరోవైపు, కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్‌ ఒకటి రెండు రోజుల్లో రైతు నాయకులతో సమావేశమవుతారని కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా తెలిపారు. ఈ నెల 27న ప్రధాని నరేంద్రమోదీ ‘మన్‌ కీ బాత్‌' ప్రసారమయ్యేప్పుడు పాత్రలను చప్పుడు చేయాలని ప్రజలను కోరుతామని బీకేయూ తెలిపింది.

‘విదేశీ విరాళాలపై హెచ్చరిక!

రైతు సంఘాలకు ఎన్నారైల నుంచి అందుతున్న విరాళాలపై బ్యాంకులు దృష్టి సారించాయి. సరైన అనుమతులు లేకుండా విదేశాల నుంచి నిధులు అందుకుంటున్నారంటూ భారతీయ కిసాన్‌ యూనియన్‌ (బీకేయూ-ఉగ్రహన్‌)ను బ్యాంకు హెచ్చరించింది. రైతుల నిరసనోద్యమానికి అడ్డంకులు సృష్టించేందుకు రైతు సంఘాలపై పన్ను చట్టాలను ప్రయోగించడం కేంద్రం ఎత్తుగడ అని పంజాబ్‌ సీఎం అమరీందర్‌సింగ్‌ విమర్శించారు. కాగా, ఢిల్లీ సరిహద్దులో నిరసనలో పాల్గొని స్వగ్రామానికి తిరిగొచ్చిన గుర్లభ్‌ సింగ్‌ అనే యువరైతు ఆత్మహత్య చేసుకున్నాడు. 

రైతుల కోసం గీజర్లు

తీవ్రమైన చలిలో సైతం నిరసన కొనసాగిస్తున్న రైతులకు స్నానానికి వేడినీళ్ల కోసం దేశవాళీ గీజర్లు అందుబాటులోకి వచ్చాయి. కట్టెలను మండించేందుకు మధ్యలో రంధ్రం, చన్నీళ్లు పోయడానికి, వేడినీళ్లు రావడానికి రెండు మార్గాలు ఉండే ఈ గీజర్లు పంజాబ్‌లో ప్రతి ఇంటిలో వాడుతుంటారు. ఆ గోడ మీద రాస్తే చాలు! నిన్నటి వరకు అది ఢిల్లీ-ఘాజీపూర్‌ సరిహద్దులో రోడ్డు పక్కన ఒక మామూలు గోడ. రైతుల ఉద్యమంలో అది మంచితనానికి చిరునామా అయింది. దుస్తులైనా మందులైనా తమకు ఏం కావాలో ఆ గోడ మీద రాస్తే చాలు. వారికవి చేరుతున్నాయి. రైతుల అవసరాలను తెలుసుకుని ఈ విధంగా తీరుస్తున్నామని రైతు నేత ఒకరు తెలిపారు.


logo