శనివారం 16 జనవరి 2021
National - Jan 04, 2021 , 23:51:49

విపరీతమైన ఒత్తిడిలో కేంద్రం

విపరీతమైన ఒత్తిడిలో కేంద్రం

న్యూఢిల్లీ: వివాదాస్పద వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని తాము చేస్తున్న ఆందోళనతో కేంద్ర ప్రభుత్వం విపరీతమైన ఒత్తిడికి గురవుతున్నదని రైతు సంఘాలు ఆరోపిస్తున్నాయి. కేంద్ర మంత్రులు, రైతు సంఘాల ప్రతినిధుల మధ్య ఏడోదఫా జరిగిన చర్చలు కూడా విఫలమయ్యాయి. తిరిగి ఈ నెల ఎనిమిదో తేదీన సమావేశం కావాలని ఇరుపక్షాలు నిర్ణయించాయి. 

తదుపరి చర్చలు ఫలప్రదంగా ఉంటాయని కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్‌ ఆశాభావం వ్యక్తం చేశారు. చట్టాల రద్దు విషయమై రైతులు మొండివైఖరి ప్రదర్శిస్తున్నారని ఆరోపించారు. పంజాబ్‌, హర్యానా రాష్ట్రాల నుంచి వేలాది మంది రైతులు ఢిల్లీలోని సింఘ్రూ, టిక్రీ, ఘజీపూర్‌, చిల్లా ప్రాంతాల్లో ఆందోళన కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. రైతుల ఆందోళన సోమవారానికి 41వ రోజుకు చేరుకున్నది. 

కిసాన్‌ యూనియన్‌ నేత బల్బీర్‌ సింగ్‌ రాజేవాల్‌ మాట్లాడుతూ సమస్యల పరిష్కారం విషయమై కేంద్ర ప్రభుత్వానికి ఉన్న ‘ఇగో’ సమస్య ఆటంకంగా మారిందని చెప్పారు. ఎంఎస్పీతోపాటు మూడు చట్టాలను రద్దు చేయాలన్న విషయమై మాత్రమే చర్చకు అంగీకరిస్తామన్నారు. అఖిల భారత కిసాన్‌ సభ (ఏఐకేఎస్‌) ప్రధాన కార్యదర్శి హన్నన్‌ మొల్లా మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం విపరీతమైన ఒత్తిడికి గురవుతున్నదని తెలిపారు.

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డోన్లోడ్ చేసుకోండి.