ఆదివారం 17 జనవరి 2021
National - Jan 12, 2021 , 18:37:40

కమిటీ వద్దు.. చట్టాల రద్దే కావాలి..

కమిటీ వద్దు.. చట్టాల రద్దే కావాలి..

న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాల విషయంలో రైతులు, ప్రభుత్వంతో మాట్లాడేందుకు సుప్రీంకోర్టు కమిటీని ఏర్పాటుచేసింది. అయితే, ఆందోళన చేస్తున్న రైతులు.. తమకు కమిటీ వద్దు.. చట్టాల రద్దే కావాలంటూ.. పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. సుప్రీంకోర్టు విచారణ బాగానే ఉంది కానీ, కమిటీతో కాలాయాపన చేయడమే లక్ష్యంగా కనిపిస్తుందని పలువురు రైతు నేతలు మీడియాకు చెప్పారు. ముందు చట్టాలను వెనక్కి తీసుకోవాలని, ఆ తర్వాతనే మిగతా విషయాలు మాట్లాడాలని రైతులు డిమాండ్‌ చేస్తున్నారు. 

కేంద్ర తీసుకొచ్చిన మూడు కొత్త అగ్రి చట్టాలను వెనక్కి తీసుకోవాలన్న డిమాండ్‌తో రైతులు గత 47 రోజులుగా ఢిల్లీ సరిహద్దులో ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. రైతుల పక్షాన కొందరు సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. చీఫ్‌ జస్టిస్‌ బోబ్డే నేతృత్వంలోని ధర్మాసనం రైతుల పిటిషన్లను విచారణ చేపట్టింది. సోమవారం నాడు కేంద్ర ప్రభుత్వం తీరును ఎండగట్టిన సుప్రీంకోర్టు.. మంగళవారం నాడు రైతులపై కన్నెర్ర జేసింది. తుదకు రైతుల డిమాండ్లపై చర్చించి ఇరుపక్షాల వాదనలు విని నివేదిక సిద్ధం చేసేందుకు సుప్రీంకోర్టు నలుగురితో కూడిన కమిటీని నియమించింది. ఈ కమిటీలో అశోక్‌ గులాటీ, ప్రమోద్‌ జోషి, భూపిందర్‌సింగ్‌ మన్‌, అనిల్‌ ఘన్వత్‌ ఉన్నారు. 

అయితే, ఏ కమిటీ ముందు తాము చర్చలకు వెళ్లబోమని రైతులు స్పష్టంగా పేర్కొన్నారు. చట్టాలను వెనక్కి తీసుకొనేంత వరకు తమ ఉద్యమాన్ని కొనసాగిస్తామని రైతులు అంటున్నారు. 26 జనవరి నిరసనపై రైతు సంస్థలు కూడా తమ స్టాండ్‌ను క్లియర్ చేశాయి. జనవరి 26 న శాంతియుత ర్యాలీని నిర్వహిస్తామని రైతులు చెప్తున్నారు. ఈ ర్యాలీతో హింస సంభవించే అవకాశాలు ఉంటాయని చాలా పుకార్లు వచ్చాయి. దీనిపై స్పందించిన రైతుల సంఘాలు శాంతియుత ఉద్యమం చేస్తున్నామని, ఎటువంటి హింసకు అనుకూలంగా లేమని స్పష్టం చేశారు. జనవరి 15 న ఉద్యమం దిశను నిర్ణయిస్తామని రైతులు చెప్తున్నారు.

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.