సోమవారం 25 జనవరి 2021
National - Dec 19, 2020 , 00:54:53

చేతులెత్తి మొక్కుతున్నా

చేతులెత్తి మొక్కుతున్నా

  • రైతన్నలారా ప్రభుత్వంతో చర్చలకు రండి
  • నాకు మంచిపేరు రావొద్దనే విపక్షాల కుట్ర
  • ఎంపీ రైతులతో సమావేశంలో ప్రధాని మోదీ

భోపాల్‌: నూతన వ్యవసాయ చట్టాలపై రైతు సంఘాలు నిరసన వీడి ప్రభుత్వంతో చర్చలకు ముందుకు రావాల్సిందిగా చేతులెత్తి మొక్కుతున్నానని ప్రధాని నరేంద్రమోదీ విజ్ఞప్తి చేశారు. ఈ చట్టాలు ఆదరాబాదరాగా తెచ్చినవి కావని.. రెండు దశాబ్దాలుగా వ్యవసాయ సంస్కరణలపై ఎడతెగని చర్చలు జరుగుతూనే ఉన్నాయని తెలిపారు. వ్యవసాయ సంస్కరణలతో తనకు వస్తున్న మంచిపేరును చూసి భరించలేకనే ప్రతిపక్షాలు కుట్రలు చేస్తున్నాయని విమర్శించారు. అన్నదాత ముందు తాను సదా ప్రణమిల్లుతానని పేర్కొన్నారు. మధ్యప్రదేశ్‌ రైతులను ఉద్దేశించి ప్రధాని మోదీ శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. 

మద్దతు ధరపై భయం వద్దు

వ్యవసాయోత్పత్తులకు కనీస మద్దతు ధరను కొనసాగించి తీరుతామని ప్రధాని హామీ ఇచ్చారు. దీనిపై రైతులు ఎవరూ భయపడాల్సిన పనిలేదని స్పష్టంచేశారు. కొత్త చట్టాలను ఆరు నెలల నుంచి అమలు చేస్తున్నామని, ఇప్పటివరకు ఒక్క వ్యవసాయ మార్కెట్‌ మూత పడలేదని పేర్కొన్నారు. 

కొత్త ఏడాదిలోపు పరిష్కారం

వ్యవసాయ చట్టాలపై రైతుల ఆందోళనతో ఏర్పడిన ప్రతిష్టంభన కొత్త ఏడాది ప్రారంభంలోపు తొలగిపోతుందని కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్రసింగ్‌ తోమర్‌ ఆశాభావం వ్యక్తంచేశారు. సమస్యల పరిష్కారానికి రైతులతో అనధికారికంగా సంప్రదింపులు కొనసాగుతున్నాయని, అధికారిక చర్చలు తిరిగి ప్రారంభించేందుకు సిద్దంగా ఉన్నామని తెలిపారు. 

కిసాన్‌ సభ మద్దతు

ఢిల్లీ సరిహద్దుల్లో గత 23 రోజులు నిర్వహిస్తున్న రైతుల ఆందోళనకు సీపీఐ అనుబంధ అఖిల భారత కిసాన్‌ సభ మద్దతు ప్రకటించింది.  తాము కూడా నిరసనోద్యమంలో పాల్గొంటామని ఆ సంస్థ నాయకులు  శుక్రవారం వెల్లడించారు. కాగా, వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా తమిళనాడులో ప్రతిపక్ష డీఎంకే శుక్రవారం ఒకరోజు దీక్ష నిర్వహించింది. 


logo