సోమవారం 26 అక్టోబర్ 2020
National - Sep 25, 2020 , 10:37:39

అగ్రి బిల్లుల‌కు వ్య‌తిరేకంగా.. రైతుల ఆందోళ‌న‌

అగ్రి బిల్లుల‌కు వ్య‌తిరేకంగా.. రైతుల ఆందోళ‌న‌

హైద‌రాబాద్‌: పార్ల‌మెంట్ వ‌ర్షాకాల స‌మావేశాల్లో ఆమోదం పొందిన మూడు వ్య‌వ‌సాయ బిల్లుల‌ను వ్య‌తిరేకిస్తూ రైతులు దేశ‌వ్యాప్తంగా ఆందోళ‌న చేస్తున్నారు.  ఢిల్లీ-అమృత్‌స‌ర్ మ‌ధ్య ఉన్న హైవేను ఇవాళ రైతులు బ్లాక్ చేశారు.  జ‌లంధ‌ర్ వ‌ద్ద భార‌తీయ కిసాన్ యూనియ‌న్, రెవ‌ల్యూష‌న‌రీ మార్కిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా ఆధ్వ‌ర్యంలో ఆందోళ‌న చేప‌ట్టారు. పంజాబ్‌లోని లుథియానా, అమృత్‌స‌ర్ జిల్లాల్లో అద‌న‌పు బ‌ల‌గాల‌ను మోహ‌రించారు. రైతులు మూడు రోజుల రైల్ రోకో చేప‌ట్ట‌డంతో.. గురువారం నుంచి అనేక రైళ్ల‌ను ర‌ద్దు చేశారు. ఇవాళ రైతులు భార‌త్ బంద్ పాటిస్తున్నారు.సెప్టెంబ‌ర్ 26వ తేదీ వ‌ర‌కు ఫిరోజ్‌పూర్ రైల్వే డివిజ‌న్ నుంచి ప్ర‌త్యేక రైళ్ల‌ను నిలిపేశారు.  

బీహార్ రాజ‌ధాని పాట్నాలో రాష్ట్రీయ జ‌న‌తాద‌ళ్ నేత తేజ‌స్వి యాద‌వ్ నిర‌స‌న‌లో పాల్గొన్నారు.  అగ్రిబిల్లుల‌ను వ్య‌తిరేకిస్తూ తేజ‌స్వి యాద‌వ్ ట్రాక్ట‌ర్‌ను న‌డిపారు. అన్న‌దాత‌ల‌ను ప్ర‌భుత్వం తోలుబొమ్మ‌ల‌ను చేసింద‌ని ఆరోపించారు. అగ్రి బిల్లులు అన్న‌దాత‌కు వ్య‌తిరేకంగా ఉన్న‌ట్లు విమ‌ర్శించారు. 2022 వ‌ర‌కు రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామ‌న్నారు. కానీ ఈ బిల్లుతో వారిని మ‌రింత పేద‌లుగా మార్చేశార‌న్నారు.  వ్య‌వ‌సాయాన్ని కార్పొటీక‌ర‌ణ చేశార‌ని విమ‌ర్శించారు. ధ‌న్‌బాగ్‌లో ఆర్జేడీ కార్య‌క‌ర్త‌లు బ‌ర్రెల‌తో ర్యాలీ తీస్తూ వ్య‌వ‌సాయ బిల్లుల‌ను వ్య‌తిరేకించారు. క‌ర్నాట‌క రాష్ట్ర రైతు సంఘం కూడా ఆందోళ‌న‌లో పాల్గొన్న‌ది. క‌ర్నాట‌క-త‌మిళ‌నాడు హైవే దారిలోని బొమ్మ‌న‌హ‌ల్లి వ‌ద్ద రైతులు నిర‌స‌న చేప‌ట్టారు. శాంతి భ‌ద్ర‌త‌ల నిమిత్తం భారీ బందోబ‌స్తును ఏర్పాటు చేశారు. 


logo