ఆదివారం 24 జనవరి 2021
National - Dec 26, 2020 , 18:35:36

29న చర్చలు నిర్వహించండి.. కేంద్రానికి రైతు నేతల లేఖ

29న చర్చలు నిర్వహించండి.. కేంద్రానికి రైతు నేతల లేఖ

న్యూఢిల్లీ: ఈ నెల 29న చర్చలు నిర్వహించాలని రైతు సంఘాల నేతలు కేంద్రానికి లేఖ రాశారు. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దులోని సింఘు వద్ద నెల రోజులకుపైగా నిరసనలు చేస్తున్న 40 రైతు సంఘాల నేతలు శనివారం సమావేశమయ్యారు. భవిష్యత్తు కార్యాచరణపై చర్చించారు. ఆరో విడత చర్చలకు తేదీ, సమయాన్ని రైతు నేతలే నిర్ణయించాలని తాజాగా కేంద్ర ప్రభుత్వం పంపిన ప్రతిపాదనపై రైతు సంఘాల నేతలు స్పందించారు. ఈ నెల 29వ తేదీ మంగళవారం ఉదయం 11 గంటలకు చర్చలు జరుపాలంటూ కేంద్రానికి ప్రతిపాదన పంపినట్లు స్వరాజ్ ఇండియా ప్రతినిధి యోగేంద్ర యాదవ్‌ తెలిపారు. మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేసే పద్ధతులు, కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ)పై చట్టపరమైన హామీ చట్టాన్ని తీసుకువచ్చే విధానం అన్నవి చర్చల కోసం తమ ఎజెండాలోని తొలి రెండు ముఖ్య అంశాలని చెప్పారు. ఈ మేరకు కేంద్రానికి లేఖ రాసినట్లు వివరించారు.

‘రైతుల చర్చలను మర్యాదపూర్వకంగా వినాలని ప్రభుత్వం కోరుకుంటున్నట్లు మాకు రాసిన లేఖలో పేర్కొన్నారు. ప్రభుత్వం నిజంగా చర్చలను కోరుకుంటే మా డిమాండ్లను తప్పుదోవ పట్టించే వ్యాఖ్యలు చేయడం మానేయండి. నిరసన చేస్తున్న రైతులపై వ్యతిరేక ప్రచారం కోసం ప్రభుత్వ వ్యవస్థను ఉపయోగించడం మానుకోండి. ఈ నెల 29వ తేదీ మంగళవారం ఉదయం 11 గంటలకు చర్చలు నిర్వహించండి’ అని  ఆ లేఖలో పేర్కొన్నట్లు యోగేంద్ర యాదవ్ వెల్లడించారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలం­గాణ ఆండ్రా­యిడ్ యాప్ డౌన్‌­లోడ్ చేసు­కోండి


logo