గురువారం 02 జూలై 2020
National - Jun 25, 2020 , 18:03:56

ఆ రైతుది గొప్ప మ‌న‌సు.. క్వారంటైన్ సెంట‌ర్ కు ఇల్లును ఇచ్చేశాడు

ఆ రైతుది గొప్ప మ‌న‌సు.. క్వారంటైన్ సెంట‌ర్ కు ఇల్లును ఇచ్చేశాడు

ముంబై : ఆ రైతు మ‌న‌సు చాలా గొప్ప‌ది. త‌న గ్రామంలో క‌రోనా సోకిన వారి ప‌ట్ల స‌హృద‌య‌త చాటుకున్నాడు. క‌రోనా బాధితులంతా ప్ర‌భుత్వం ఏర్పాటు చేసిన క్వారంటైన్ సెంట‌ర్ల‌కు వెళ్లేందుకు ఇష్ట‌ప‌డ‌లేదు. వారి బాధ‌ను అర్థం చేసుకున్న రైతు.. త‌న కుటుంబ స‌భ్యుల‌ను ఒప్పించి.. మెప్పించి.. త‌న ఇంటిని క్వారంటైన్ సెంట‌ర్ గా మార్చేశాడు. 

ఔరంగాబాద్ జిల్లా హ‌ర్సుల్ లోని పిసాదేవీ ఏరియాలో కిర‌ణ్ డోలారే పాటిల్ అనే రైతు నివ‌సిస్తున్నాడు. అత‌నికి వ్య‌వ‌సాయం పొలం కూడా బాగానే ఉంది. వ్య‌వ‌సాయ క్షేత్రం వ‌ద్ద ఓ ఇంటిని గ‌తంలోనే నిర్మించుకున్నాడు. ఇప్పుడు త‌న సొంత గ్రామంలో చాలా మందికి క‌రోనా పాజిటివ్ నిర్ధార‌ణ అయింది. జిల్లా యంత్రాంగం ఏర్పాటు చేసిన క్వారంటైన్ సెంట‌ర్లో ఉండేందుకు ఇష్ట ప‌డ‌లేదు. 

క‌రోనా బాధితుల బాధ‌ను అర్థం చేసుకున్న ఆ రైతు.. త‌నకున్న నాలుగు విశాల‌మైన గ‌దుల‌ను క్వారంటైన్ సెంట‌ర్ గా మార్చేందుకు కుటుంబ స‌భ్యుల‌ను ఒప్పించాడు. ఇక త‌మ నివాసాన్ని వ్య‌వ‌సాయ పొలంలోని ఇంటికి మార్చాడు.  

ఒక్క రూపాయి కూడా వ‌సూలు చేయ‌ను

త‌న ఇంటిని క్వారంటైన్ సెంట‌ర్ గా మార్చ‌డం త‌న సొంత నిర్ణ‌యం. జిల్లా యంత్రాంగం నుంచి కానీ, లేదా క‌రోనా బాధితుల వ‌ద్ద ఒక్క రూపాయి కూడా వ‌సూలు చేయ‌న‌ని రైతు స్ప‌ష్టం చేశాడు. క‌రోనా బాధితుల‌కు సేవ‌లందించేందుకు ఒక ప‌ని మ‌నిషిని కూడా నియ‌మించాడు. ఆమెకు త‌నే జీతం ఇస్తున్నాడు. 

తన ఇంటిని క్వారంటైన్ సెంట‌ర్ గా మారుస్తున్న‌ట్లు రైతు.. గ్రామ స‌ర్పంచి దృష్టికి తీసుకొచ్చాడు. దీంతో కిర‌ణ్ డోలారేను స‌ర్పంచి అభినందించారు. ఆ ఇంటికి కావాల్సిన మౌలిక వ‌స‌తుల‌ను క‌ల్పించారు స‌ర్పంచ్. ప‌వ‌ర్, వాట‌ర్, డ్రైనేజీ స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్కారం చేశారు.  logo