బుధవారం 27 జనవరి 2021
National - Dec 25, 2020 , 21:37:48

ట్రాక్టర్లతో రిపబ్లిక్‌ డే పరేడ్‌కు వస్తాం.. కేంద్రానికి రైతుల హెచ్చరిక

ట్రాక్టర్లతో రిపబ్లిక్‌ డే పరేడ్‌కు వస్తాం.. కేంద్రానికి రైతుల హెచ్చరిక

న్యూఢిల్లీ: వ్యవసాయ చట్టాలను కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోకపోతే జనవరి 26న జరిగే పరేడ్‌కు ట్రాక్టర్లలో వచ్చి పాల్గొంటామని రైతు సంఘాల నేతలు హెచ్చరించారు. అగ్రి చట్టాలను ప్రభుత్వం వెనక్కి తీసుకోనంత వరకు పోరాటంపై వెనక్కి తగ్గబోమని భారతీయ కిసాన్‌ యూనియన్‌ నేత రాకేశ్ తికైట్ స్పష్టం చేశారు. లేనిపక్షంలో జనవరి 26న ఢిల్లీలో జరిగే రిపబ్లిక్‌ డే పరేడ్‌కు జాతీయ జెండాలతో కూడిన ట్రాక్టర్లు, ట్రాలీలతో వచ్చి పాల్గొంటామని హెచ్చరించారు. అప్పుడు నీటి ఫిరంగీలతో ఎలా అడ్డుకుంటారో చూస్తామని అన్నారు. దేశభక్తుడు, ఖలీస్థానీ ఎవరన్నది అప్పుడు తెలుస్తుందని చెప్పారు. నిరసనలు చేస్తున్న రైతులను ఖలీస్థానీయులతో బీజేపీ నేతలు పోల్చిన నేపథ్యంలో ఆయన ఈ మేరకు వ్యాఖ్యానించారు. 

ప్రధాని మోదీ ప్రభుత్వం ఈ సమస్యకు ఒక పరిష్కారాన్ని కనుగొనాలని రాకేశ్‌ కోరారు. ప్రతిపక్షమో లేక రాహుల్‌ గాంధీ ఇది చేస్తారని అనుకోవద్దన్నారు. ఎవరూ కూడా రైతులను తప్పుదారి పట్టించడం లేదని చెప్పారు. వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవడం, కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలన్నదే తమ డిమాండ్‌ అన్నారు. రైతులు ఇండ్లను వీడి నెల రోజులు అవుతున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. షరతులు లేని చర్చలకు తాము సిద్ధమేనని తెలిపారు. కూర్చొని చర్చించి వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవాలని కేంద్రానికి సూచించారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలం­గాణ ఆండ్రా­యిడ్ యాప్ డౌన్‌­లోడ్ చేసు­కోండి


logo