శుక్రవారం 26 ఫిబ్రవరి 2021
National - Jan 27, 2021 , 22:01:58

పార్లమెంట్‌ మార్చ్‌ వాయిదా : బీకేయూ (ఆర్‌)

పార్లమెంట్‌ మార్చ్‌ వాయిదా : బీకేయూ (ఆర్‌)

న్యూఢిల్లీ : వచ్చే నెల ఒకటిన తలపెట్టిన పార్లమెంట్‌ మార్చ్‌ వాయిదా వేస్తున్నట్లు భారతీయ కిసాన్ యూనియన్ (ఆర్) నేత బల్బీర్ ఎస్ రాజేవాల్ పేర్కొన్నారు. అయితే, రైతుల ఆందోళనకు మద్దతుగా జనవరి 30న అమరవీరుల దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా ర్యాలీలు తీయనున్నట్లు బుధవారం ప్రకటించారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా మంగళవారం చేపట్టిన ట్రాక్టర్ ర్యాలీ హింసాత్మకంగా మారిన విషయం తెలిసిందే. ఇందులో పోలీసులు, రైతులకు మధ్య తీవ్ర ఘర్షణలు తలెత్తాయి. రైతులు ముందుగా అనుకున్న దారిలో కాకుండా వేరే దారిలో రావడంతో హింసకు దారి తీసిందని పోలీసులు ఆరోపిస్తుండగా.. తమ ఆందోళనలోకి బయటి శక్తులు ప్రవేశించడం వల్లే ఇలా జరిగిందని రైతు సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఎర్రకోటను రైతులు ముట్టడించడం, ఎర్రకోటపై నిషాన్ సాహిబ్ జెండా ఎగరవేయడం సంచలనంగా మారింది. దీంతో భారతీయ కిసాన్ యూనియన్ (భాను), రాష్ట్రీయ కిసాన్ మజ్దూర్ సంఘటన్ రైతు సంఘాలు ఈ ఆందోళన విరమిస్తున్నట్లు ప్రకటించాయి. మంగళవారం చోటు చేసుకున్న హింసను రెండు సంఘాలు ఖండించాయి.

ఈ పద్ధతిలో నిరసనను కొనసాగించలేమని సంఘాల నేతలు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా రాష్ట్రీయ కిసాన్‌ మజ్దూర్‌ సంఘటన్‌ నాయకుడు ఘామిపూర్‌ సరిహద్దులో వీఎం సింగ్‌ మాట్లాడుతూ తమ యూనియన్‌ రైతుల నిరసన నుంచి తక్షణమే ఉపసంహరించుకుంటుందని, నిరసన జరిగిన పద్ధతి ఆమోదయోగ్యం కాదని, నిరసన నుంచి వైదొలగుతున్నట్లు ప్రకటించారు. అనంతరం బీకేయూ (ఆర్‌) సంఘం నేత మాట్లాడారు. అమరవీరుల దినోత్సవం సందర్భంగా రైతులకు మద్దతుగా దేశవ్యాప్తంగా ఆందోళన చేపట్టబోతున్నామన్నారు. అమరవీరుల దినోత్సవమైన జనవరి 30న దేశవ్యాప్తంగా పబ్లిక్ ర్యాలీలు చేపడతామని, అంతే కాకుండా ఒకరోజు ఉపవాస దీక్షలు చేపట్టనున్నట్లు చెప్పారు. ఢిల్లీలో జరిగిన హింసాత్మక సంఘటనల కారణంగా ఫిబ్రవరి 1న పార్లమెంట్‌కు మార్చ్‌ను వాయిదా వేస్తున్నట్లు తెలిపారు. రైతులు చాలా మంది శాంతియుతంగానే ఉన్నారని, ర్యాలీని భగ్నం చేసేందుకు కుట్ర జరిగిందని ఆరోపించారు. రైతులు దాన్ని భగ్నం చేసేందుకు ప్రయత్నించినప్పటికీ.. 99.9శాతం మంది రైతులు శాంతియుతంగా ఉన్నారని పేర్కొన్నారు. ఏదైమైనా మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన కొనసాగుతుందని, ఆందోళనను విరమించుకోలేదని స్పష్టం చేశారు. 

VIDEOS

logo