సోమవారం 25 జనవరి 2021
National - Jan 04, 2021 , 18:36:00

అగ్రి చట్టాలను వెనక్కి తీసుకోం.. రైతులకు కేంద్రం స్పష్టం

అగ్రి చట్టాలను వెనక్కి తీసుకోం.. రైతులకు కేంద్రం స్పష్టం

న్యూఢిల్లీ: మూడు వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోలేమని కేంద్రం తెలిపింది. 41 రైతు సంఘాల నేతలతో సోమవారం నిర్వహించిన ఏడో విడత చర్చల్లో ఈ విషయాన్ని స్పష్టం చేసింది. కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్‌తోపాటు కేంద్ర మంత్రులు పియూష్ గోయల్, సోమ్ ప్రకాష్ ఈ చర్చల్లో పాల్గొన్నారు. వ్యవసాయ చట్టాల్లో పేర్కొన్న ఏదైనా నిబంధనను రైతులు సమస్యగా భావిస్తే దానిపై సమీక్ష చేస్తామని చెప్పారు. రైతుల ప్రయోజనం కోసం తెచ్చిన వ్యవసాయ చట్టాలను పూర్తిగా వెనక్కి తీసుకోబోమని అన్నారు. ఈ నెల 8న మరో విడత చర్చలను నిర్వహిస్తామని వెల్లడించారు. కేంద్ర మంత్రులు గతంలో మాదిరిగా రైతులతో కలిసి భోజనం కూడా చేయలేదు. దీంతో కేంద్ర ప్రభుత్వం, రైతుల మధ్య చర్చల పురోగతిలో మరోసారి ప్రతిష్టంభన నెలకొన్నది. 

మరోవైపు వ్యవసాయ చట్టాలను కేంద్రం వెనక్కి తీసుకోవాలని, కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలన్నవే తమ రెండు ప్రధాన డిమాండ్లని రైతు నేతలు తెలిపారు. వీటిని పరిష్కరించడమే కేంద్ర ప్రభుత్వం ముందున్న మార్గమని తాము చెప్పినట్లు రైతు నేత జోగిందర్‌ సింగ్‌ చెప్పారు. కాగా జనవరి 26 లోగా తమ డిమాండ్లను కేంద్ర ప్రభుత్వం నెరవేర్చకపోతే వేలాది మంది రైతులు రిపబ్లిక్ డే పరేడ్ నిర్వహించడానికి తమ ట్రాక్టర్లలో రాజధానిలోకి ప్రవేశిస్తారని వ్యవసాయ సంఘాల వేదిక అయిన సంయుక్త్‌ కిసాన్ మోర్చా మరోసారి హెచ్చరించింది. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo