శనివారం 23 జనవరి 2021
National - Nov 29, 2020 , 12:47:39

నూతన సంస్కరణలతో రైతులకు కొత్త అవకాశాలు : ప్రధాని మోదీ

నూతన సంస్కరణలతో రైతులకు కొత్త అవకాశాలు :  ప్రధాని మోదీ

న్యూఢిల్లీ : ఇటీవల తీసుకువచ్చిన వ్యవసాయ రంగ సంస్కరణలు రైతులకు కొత్త అవకాశాలకు తలుపులు తెరిచాయని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. నెలవారీ రేడియో కార్యక్రమం మన్‌కీ బాత్‌లో ఆయన జాతినుద్దేశించి ప్రసంగించారు. దేశరాజధాని శివారులో కేంద్రం కొత్తగా తీసుకువచ్చిన వ్యవసాయ బిల్లులను వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున ఆందోళన కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. భారతదేశంలో వ్యవసాయం, సంబంధిత అంశాలకు కొత్త కోణాలు జోడించబడుతున్నాయని పేర్కొన్నారు. ఇటీవలి వ్యవసాయ సంస్కరణలు రైతులకు కొత్త అవకాశాల కోసం తలుపులు తెరిచాయని చెప్పారు. దశాబ్దాల నాటి రైతుల డిమాండ్లు, అనేక రాజకీయ పార్టీలు నెరవేరుస్తామని వాగ్ధానం చేశాయని, అవి ఇప్పుడు నెరవేరాయన్నారు.

మేధోమధనం తర్వాత పార్లమెంటు వ్యవసాయ సంస్కరణ చట్టాలను ఆమోదించిందని, ఈ సంస్కరణలు రైతుల సంకెళ్లను ఛేదించడమే కాకుండా కొత్త హక్కులు, అవకాశాలు కల్పించాయన్నారు. వీటితో రైతుల సమస్యలను చాలా త్వరగా తగ్గించడం ప్రారంభించాయన్నారు. సెప్టెంబర్‌లో పార్లమెంట్‌లో ఆమోదించిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పంజాబ్‌, హర్యానాకు చెందిన రైతులు పెద్ద ఎత్తున ఆందోళన కొనసాగిస్తున్న నేపథ్యంలో ప్రధాని ఈ వ్యాఖ్యలు చేశారు. ఇదిలా ఉండగా.. దేశంలో కరోనా పరిస్థితిపై సైతం ప్రధాని ప్రజలను హెచ్చరించారు. వైరస్‌ పట్ల నిర్లక్ష్యం వహించొద్దని, ఇప్పటికీ చాలా ప్రమాదకరమైందని పేర్కొన్నారు.


logo