బుధవారం 20 జనవరి 2021
National - Dec 18, 2020 , 14:49:04

వ్య‌వ‌సాయ చట్టాలు రాత్రికి రాత్రి తెచ్చిన‌వి కాదు: ప‌్ర‌ధాని మోదీ

వ్య‌వ‌సాయ చట్టాలు రాత్రికి రాత్రి తెచ్చిన‌వి కాదు: ప‌్ర‌ధాని మోదీ

న్యూఢిల్లీ: వ‌్య‌వ‌సాయ చ‌ట్టాలు రాత్రికి రాత్రి తీసుకొచ్చిన‌వి కావ‌ని, దీని వెనుక ద‌శాబ్దాల పాటు చ‌ర్చ‌లు, సంప్ర‌దింపులు ఉన్నాయ‌ని ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ అన్నారు. ఈ చ‌ట్టాల‌ను వ్య‌తిరేకిస్తూ ఢిల్లీలో రైతులు ఆందోళ‌న చేప‌ట్టిన నేప‌థ్యంలో శుక్ర‌వారం మ‌ధ్య‌ప్ర‌దేశ్ రైతుల‌తో వ‌ర్చువ‌ల్ స‌మావేశంలో ఆయ‌న మాట్లాడారు. ఇత‌ర దేశాల రైతులు కొత్త కొత్త టెక్నాల‌జీల‌తో ముందుకు దూసుకెళ్తున్న వేళ మ‌న దేశ రైతులు వెనుక‌బ‌డేలా చేయ‌డం స‌మంజ‌సం కాదు. కొత్త చ‌ట్టాల గురించి ఇప్పుడు ఎన్నో చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి. కానీ ఇవి ఎప్పుడో తీసుకురావాల్సిన చట్టాలు. మ‌న రైతులు కూడా కొన్ని ద‌శాబ్దాలుగా వీటిని డిమాండ్ చేస్తున్నారు. గ‌తంలో పార్టీల మేనిఫెస్టోలు చూసినా ఇవే హామీలు క‌నిపిస్తాయి అని మోదీ స్ప‌ష్టం చేశారు.

ఈ సంద‌ర్భంగా ప్ర‌తిప‌క్షాల‌పై కూడా మోదీ మండిప‌డ్డారు. తాము రాజ‌కీయంగా ల‌బ్ధి పొంద‌డానికి రైతుల‌ను త‌ప్పుదోవ ప‌ట్టిస్తున్నార‌ని ఆయ‌న విమ‌ర్శించారు. ప్రతిప‌క్షాల‌కు చ‌ట్టాల‌తో ఎలాంటి స‌మ‌స్యా లేదు. కానీ వాళ్లు హామీ ఇచ్చిన నెర‌వేర్చ‌లేని దానిని మోదీ చేసి చూపించాడ‌న్న‌దే వారి బాధ‌. నేను చేతులు జోడించి ప్ర‌తిప‌క్షాల‌కు ఒక్క‌టే చెప్ప‌ద‌ల‌చుకున్నాను. ద‌య‌చేసి, మీకు క్రెడిట్ కావాలంటే తీసుకోండి. నేను రాజ‌కీయ పార్టీల మేనిఫెస్టోల‌కు క్రెడిట్ ఇస్తాను అని మోదీ అన్నారు. 

వాళ్లు అధికారంలో ఉన్న‌పుడు స్వామినాథ‌న్ క‌మిష‌న్ సిఫార‌సుల‌ను అమ‌లు చేయ‌లేద‌ని మోదీ విమ‌ర్శించారు. తాము అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత ఆ రిపోర్ట్‌ను వెలికి తీసి అమ‌లు చేస్తున్న‌ట్లు చెప్పారు. కాంగ్రెస్ త‌ప్పుడు హామీల గురించి మ‌ధ్య‌ప్ర‌దేశ్ రైతులకు బాగా తెలుసు అని ఆయ‌న అన్నారు. రైతుల‌కు రుణ‌మాఫీ అన్నారు. మ‌రి మీ అంద‌రికీ దాని వ‌ల్ల ల‌బ్ధి క‌లిగిందా అని రైతుల‌ను అడిగారు. వాళ్లు చిన్న రైతుల‌కు రుణ మాఫీ చేయ‌లేద‌ని, పెద్ద రైతులే దీని వ‌ల్ల ల‌బ్ధి పొందార‌ని ఆరోపించారు.

క‌నీస మ‌ద్ద‌తు ధ‌ర‌ను తొల‌గించే ప్ర‌స‌క్తే లేద‌ని కూడా ప్ర‌ధాని ఈ సంద‌ర్భంగా స్ప‌ష్టం చేశారు. ఒక‌వేళ తమ‌కు ఎంఎస్‌పీని తీసివేసే ఉద్దేశ‌మే ఉంటే.. ఎందుకు స్వామినాథన్ క‌మిష‌న్ రిపోర్ట్‌ను అమ‌లు చేస్తామ‌ని ప్ర‌శ్నించారు. మ‌ద్ద‌తు ధ‌ర విష‌యంలో త‌మ ప్ర‌భుత్వం చాలా సీరియ‌స్‌గా ఉన్న‌ద‌నీ, అందుకే ప్ర‌తి ఏటా పంట వేయ‌కముందే మ‌ద్ద‌తు ధ‌ర‌ను ప్ర‌క‌టిస్తున్నామ‌ని మోదీ చెప్పారు. దీనివ‌ల్ల రైతులు పంట వేసేట‌ప్పుడే సులువుగా లెక్క‌లు వేసుకోగ‌లుగుతార‌ని ఆయ‌న అన్నారు.


logo