న్యూఢిల్లీ: ఏమైందో ఏమో ఓ యువతి మెట్రో స్టేషన్ పైనుంచి దూకడానికి ప్రయత్నించింది. ఇంతలో పోలీసులు అక్కడికి వచ్చారు. వారిని చూసిన ఆమె దూకేస్తానని బెదిరించింది. అయితే ఆమెను చిన్నగా మాటల్లోకి దించారు. ఇంతలో ఓ కానిస్టేబుల్ స్టేషన్ బాల్కనీపై కూర్చున్న ఆ యువతి వద్దకు చేరుకున్నాడు. ఆమె కిందికి దూకకుండా పట్టుకుని రక్షించాడు. ఇదంతా దేశ రాజధాని ఢిల్లీలోని ఫరీదాబాద్ మెట్రో రైల్ స్టేషన్లో జరిగింది.
శనివారం సాయంత్రం 6.30 గంటలు అయింది. ఫరీదాబాద్‌లోని సెక్టర్ 28 మెట్రో స్టేషన్ బాల్కనీ పైకి ఓ యువతి వచ్చింది. పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించింది. సమాచారం అందుకున్న ఎస్సై ధన్ ప్రకాశ్ కానిస్టేబుల్ సర్ఫ్రాజ్తో కలిసి ఘటనా స్థలానికి చేరుకున్నారు. మెట్రో సిబ్బంది, సీఐఎస్ఎఫ్ సిబ్బందిని అడిగి పరిస్థితిని తెలుసుకున్నాడు. స్టేషన్ కింద ఉన్న ఎస్సై చిన్నగా మాటల్లోకి దించి ఆ యువతి దృష్టి మరల్చాడు. ఇంతలో కానిస్టేబుల్ సర్ఫ్రాజ్ స్టేషన్ బాల్కనీకి చేరుకున్నాడు. అమాంతం ఆమెను పట్టుకున్నాడు. మరో వ్యక్తి సాయంతో ఆమెను స్టేషన్‌పైకి చేర్చారు. ఆ యువతి ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్నదని, మానసిక ఒత్తిడితో ఆత్మహత్యా యత్నానికి పాల్పడినట్లు ప్రాధమిక విచారణలో తేలిందని పోలీసులు వెల్లడించారు. కాగా, ఈ వీడియోను ఫరీదాబాద్ పోలీసులు సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ప్రాణాలకు తెలిగింది ఆ యువతిని కాపాడిన అధికారులను అందరూ పొగుడుతున్నారు. ప్రస్తుతం ఆ వీడియో తెగ షేరవుతున్నది.