మంగళవారం 04 ఆగస్టు 2020
National - Jul 24, 2020 , 08:14:27

మున్సిప‌ల్ సిబ్బంది అత్యుత్సాహం.. క్ష‌మాప‌ణ‌లు చెప్పిన క‌మిష‌న‌ర్‌

మున్సిప‌ల్ సిబ్బంది అత్యుత్సాహం.. క్ష‌మాప‌ణ‌లు చెప్పిన క‌మిష‌న‌ర్‌

బెంగ‌ళూరు : ‌బెంగ‌ళూరు మున్సిప‌ల్ సిబ్బంది అత్యుత్సాహం ప్ర‌దర్శించారు. ఓ ఇంటి త‌లుపుల‌కు అడ్డంగా రేకుల‌ను అమ‌ర్చ‌డంతో.. వివాదాస్ప‌దానికి దారి తీసింది. దీంతో ఆ ఇంటి స‌భ్యుల‌కు బృహ‌త్ బెంగ‌ళూరు మ‌హాన‌గ‌ర పాలిక క‌మిష‌న‌ర్ ఎన్ మంజునాథ ప్ర‌సాద్ క్ష‌మాప‌ణ‌లు చెప్పారు. 

బెంగ‌ళూరులో వారం రోజుల పాటు విధించిన లాక్‌డౌన్ మంగ‌ళ‌వారం ముగిసింది. దీంతో క‌రోనా వైర‌స్ కేసుల తీవ్ర‌త‌ను త‌గ్గించేందుకు మున్సిప‌ల్ సిబ్బంది క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటోంది. ఈ క్ర‌మంలోనే డోమ్లూరులోని రెండు ఇండ్ల‌కు కుటుంబ స‌భ్యుల అనుమ‌తి లేకుండానే రేకుల‌ను అడ్డంగా అమ‌ర్చారు. ఆ ఇండ్ల‌లో ఇద్ద‌రు వృద్ధ దంప‌తుల‌తో పాటు ఇద్ద‌రు పిల్ల‌లు ఉంటున్నారు.

ఈ రేకుల‌ను అమ‌ర్చ‌డంపై పెద్ద దుమారం చెల‌రేగింది. ఇలా రేకుల‌ను అమ‌ర్చితే అత్య‌వ‌స‌ర ప‌రిస్థితుల్లో బ‌య‌ట‌కు రావ‌డం ఎలా? అని ప‌లువురు ప్ర‌శ్నించారు. సిబ్బంది అత్యుత్సాహం ప్ర‌ద‌ర్శించ‌డం స‌రికాద‌ని స్థానికులు మండిప‌డ్డారు. ఈ విష‌యం బీబీఎంపీ క‌మిష‌నర్ దృష్టికి వెళ్లింది. బాధిత కుటుంబ స‌భ్యుల‌కు క‌మిష‌న‌ర్ ఎన్ మంజునాథ ప్ర‌సాద్ క్ష‌మాప‌ణ‌లు చెప్పారు. త‌క్ష‌ణ‌మే రేకులు తొల‌గించాల‌ని కింది స్థాయి అధికారుల‌ను ప్ర‌సాద్ ఆదేశించారు. క‌రోనా సోకిన వారిని ర‌క్షించ‌డం, సోక‌ని వారిని సుర‌క్షితంగా ఉండేలా చేయ‌డ‌మే సిబ్బంది ఉద్దేశ‌మ‌ని ఆయ‌న పేర్కొన్నారు. ఈ విష‌యంలో ఎలాంటి ఇబ్బంది ఎదురైనా ప‌రిష్క‌రించేందుకు సిద్ధంగా ఉన్నామ‌ని క‌మిష‌న‌ర్ తెలిపారు.

క‌ర్ణాట‌క‌లో గురువారం ఒక్క‌రోజే 5,030 పాజిటివ్ కేసులు న‌మోదు కాగా, 97 మంది ప్రాణాలు కోల్పోయారు. 5 వేల పాజిటివ్ కేసుల్లో 2,207 కేసులు ఒక్క బెంగ‌ళూరులోనే న‌మోదు అయ్యాయి. క‌ర్ణాట‌క‌లో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 80,863కు చేరింది. 


logo