బుధవారం 15 జూలై 2020
National - Jun 04, 2020 , 18:12:12

కరోనా టెస్టులు తగ్గించారెందుకు ఉద్ధవ్‌: ఫడ్నవీస్

కరోనా టెస్టులు తగ్గించారెందుకు ఉద్ధవ్‌: ఫడ్నవీస్

ముంబై: మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్‌.. ఉద్ధవ్‌ థాక్రే సంకీర్ణ సర్కారు తీరుపై విమర్శలు గుప్పించారు. కరోనా వైరస్‌ కట్టడికి సరైన చర్యలు చేపట్టడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఫడ్నవీస్‌ ఆరోపించారు. ఈ మేరకు మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్‌ థాక్రేకు ఫడ్నవీస్‌ లేఖ రాశారు. కరోనా నిర్ధారణ పరీక్షలను ప్రభుత్వం ఎందుకు తగ్గించిందని ఆ లేఖలో ప్రశ్నించారు. రోజూ వేలల్లో కొత్త కేసులు బయటపడుతుంటే నిర్ధారణ పరీక్షల క్వాంటిటీ తగ్గించడం ప్రమాదకరమని ఫడ్నవీస్‌ ఆందోళన వ్యక్తం చేశారు. 

ప్రభుత్వం కరోనా నిర్ధారణ పరీక్షలు ఎక్కువగా చేయకపోవడంతో బాధితుల్లో వైరస్‌ ప్రభావం పెరిగి చనిపోతున్నారని ఫడ్నవీస్‌ విమర్శించారు. ముంబైలోని అన్ని ల్యాబ్‌లలో కలిపి రోజుకు 10 వేల మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు జరిపే సామర్థ్యం ఉన్నదని, కానీ ప్రభుత్వం మాత్రం ప్రతిరోజు కేవలం 3500 నుంచి 4000 మందికే పరీక్షలు నిర్వహిస్తున్నదని, తక్కువ పరీక్షలు చేయడంలో అంతర్యం ఏమిటని ఫడ్నవీస్‌ తన లేఖలో ప్రశ్నించారు. కాగా, ముంబైలో కరోనా మహమ్మారి వేగంగా విస్తరిస్తున్నది. ఇప్పటికే ఆ రాష్ట్రంలో 75 వేల మందికి పైగా కరోనా బారినపడి వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.


logo