శనివారం 16 జనవరి 2021
National - Dec 05, 2020 , 16:13:56

బీజేపీ నాయకులు షేర్‌చేస్తున్న వీడియో పాతదేనట..!

బీజేపీ నాయకులు షేర్‌చేస్తున్న వీడియో పాతదేనట..!

న్యూఢిల్లీ: ఈ మధ్య సోషల్‌ మీడియాలో ఫేక్‌న్యూస్‌, ఫేక్ వీడియోస్‌ పెద్ద సంఖ్యలో షేర్‌ అవుతున్నాయి. ఏది నిజం.. ఏది అబద్ధం తెలుసుకోలేని స్థితిలో జనాలున్నారు. స్పైస్ బ్రాండ్ ఎండీహెచ్ (మహాషియన్ డి హట్టి) యజమాని, సీఈవో ధరంపాల్ గులాటి గురువారం 98 ఏళ్ల వయసులో కన్నుమూశారు. ఢిల్లీలోని మాతా చనన్ దేవి దవాఖానలో చికిత్స పొందారు. గుండెపోటుతో ఆయన చనిపోయారు. అయితే, ఆయన చివరి క్షణాల్లో దేశభక్తి పాటలో లీనమై ఉన్న వీడియో నెట్టింట వైరల్‌ అవుతోంది. దీన్ని బీజేపీ నాయకులతోసహా పలువురు నెటిజన్లు షేర్‌చేస్తున్నారు. కాగా,  ఆ వీడియో ఇప్పటిదికాదని, పాతదని తేలింది. 

ఈ వీడియోలో ధరంపాల్ గులాటి హాస్పిటల్ బెడ్ మీద పడుకున్నట్లు కనిపిస్తుంది. ఆయన దగ్గర నిలబడి ఉన్న ఒక వ్యక్తి 'ప్రీత్ జహాన్ కి రీత్ సదా' పాట పాడుతున్నాడు  చుట్టూ ఉన్నవారు చప్పట్లుకొడుతుండగా ధరంపాల్ కూడా దేశభక్తి గీతంలో పూర్తిగా మునిగిపోయాడు. ‘ఇవి ధరంపాల్ గులాటి చివరి క్షణాలు’ అని వీడియో షేర్ అవుతోంది. చిత్రనిర్మాత వివేక్ అగ్నిహోత్రి ఈ వీడియోను ట్విట్టర్‌లో షేర్ చేశారు, అయితే, ఈ వీడియో ఇటీవలిది కాదని, 2019 సెప్టెంబర్-అక్టోబర్‌లో ధరంపాల్‌సింగ్‌ దవాఖానలో చేరినప్పటిదని తేలింది. వైరల్ వీడియోలో పాడుతున్న వ్యక్తి పేరు రాకేశ్ అహుజా అని దవాఖాన వర్గాలు వెల్లడించాయి.

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.