బుధవారం 05 ఆగస్టు 2020
National - Jul 27, 2020 , 07:47:09

మా గ్రామాన్ని కాపాడండి.. రాష్ట్రపతికి బాలుడి లేఖ

మా గ్రామాన్ని కాపాడండి.. రాష్ట్రపతికి బాలుడి లేఖ

తిరువనంతపురం : ప్రకృతి విపత్తుల నుంచి మా గ్రామాన్ని కాపాడండి సార్‌ అంటూ.. పదో తరగతి చదువుతున్న ఓ 14 ఏళ్ల బాలుడు స్వయానా రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌కు జులై 25న లేఖ రాశాడు. తమ గ్రామంతో పాటు తన కుటుంబానికి సహాయం చేయాలని రాష్ట్రపతిని కోరాడు. ఒక వైపు సముద్రపు కోత, మరోవైపు కరోనా విజృంభణ.. ఈ రెండింటితో తమ గ్రామం విలవిలలాడిపోతోందని లేఖలో బాలుడు పేర్కొన్నాడు. గత వారం రోజుల నుంచి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, భయంతోనే లేఖ రాస్తున్నానని ఆ అబ్బాయిలో లేఖలో తెలిపాడు. సముద్రపు గోడ నిర్మించి.. మమ్మల్ని రక్షించండి అంటూ రాష్ట్రపతిని ప్రాధేయపడ్డాడు. 

లేఖలోని సారాంశం.. నేను ఈద్గర్‌ సెబాస్టియన్‌. పదో తరగతి చదువుతున్నాను. నా గ్రామం చెల్లనం(కేరళ).. ప్రతి ఏడాది ప్రకృతి విపత్తులకు బలవుతూనే ఉంది. మాకు సహాయం చేయడానికి ఎవరూ లేరు. ఆ భయంతోనే లేఖ రాస్తున్నాను. నాకు బాగా గుర్తు.. ప్రతి సంవత్సరం రెండు సార్లు మా గ్రామాన్ని విడిచి వెళ్లిపోతాం. ఎండకాలం, రుతుపవనాల సమయంలో మా గ్రామం సముద్రపు కోతకు గురవుతుంది. ఇండ్లలోకి నీరు వస్తుంది. ఈ సంవత్సరం జులై 16 నుంచి సముద్రపు కోత ప్రారంభమైంది. ప్రతి ఏడాది మాదిరిగానే మా బంధువుల ఇంటికి వెళ్లేందుకు సిద్ధమయ్యాం. కానీ మా ప్రాంతంలో కరోనా వ్యాప్తి కారణంగా వెళ్లలేకపోతున్నాం. ఇప్పటికే వందలాది మందికి కరోనా సోకింది అని లేఖలో పేర్కొన్నాడు. 

తమ గ్రామాన్ని కాపాడుకునేందుకు సముద్రపు గోడ నిర్మించాలని డిమాండ్‌ చేస్తూ అనేకసార్లు తమ గ్రామస్తులతో పాటు తాను కూడా నిరాహార దీక్షలు, పలు నిరసనల్లో పాల్గొన్నానని సెబాస్టియన్‌ వివరించాడు. అయినప్పటికీ తమ గ్రామాన్ని ఎవరూ పట్టించుకోవడం లేదు. కనీసం తమ గ్రామం వైపు కన్నెత్తి చూడడం లేదన్నాడు. సముద్రపు కోత వల్ల ఇప్పటికే 400 ఇండ్లు దెబ్బతిన్నాయి. ఆరు ఇండ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. దీంతో వస్తువులతో పాటు పాఠ్యపుస్తకాలు తడిసి ముద్దయ్యాయని సెబాస్టియన్‌ చెప్పాడు. 

సమస్యల సుడిగుండంలో ఉన్న తమ గ్రామాన్ని మీరే కాపాడాలి. భారత సరిహద్దుల్లో అరేబియా సముద్రం ఒకటి. ఈ సరిహద్దును రక్షించాల్సిన బాధ్యత మీపై ఉందని నమ్ముతున్నాను. సముద్ర గోడను నిర్మించి.. మమ్మల్ని రక్షించండి అంటూ సెబాస్టియన్‌ రాష్ట్రపతికి విన్నవించాడు. logo