ఆదివారం 24 జనవరి 2021
National - Dec 20, 2020 , 22:26:20

నిరసనలకేనంటూ కిసాన్‌ ఏక్తా మోర్చా ఖాతా రిమూవ్‌

 నిరసనలకేనంటూ కిసాన్‌ ఏక్తా మోర్చా ఖాతా రిమూవ్‌

న్యూఢిల్లీ: కేంద్ర వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని కోరుతూ ఢిల్లీ సరిహద్దుల్లో అన్నదాతలు ఆందోళన చేస్తున్న వేళ.. కిసాన్‌ ఏక్తా మోర్చా అనే సంస్థ ఫేస్‌బుక్‌ ఖాతాను సోషల్‌ మీడియా జెయింట్‌ ‘ఫేస్‌బుక్‌’ ఆదివారం తొలగించివేసింది. కిసాన్‌ ఏక్తా మోర్చా బ్యానర్‌ కింద సోషల్‌ మీడియా వేదికలను వాడుకుంటూ యువ నేతల నిరసనను డాక్యుమెంట్‌ చేస్తున్నారని, అందుకే తొలగించి వేశామని ఫేస్ బుక్ తెలిపింది. 

ఫేస్‌బుక్‌ నిర్ణయంపై కిసాన్‌ ఏక్తా మోర్చా ట్విట్టర్‌ వేదికగా స్పందించింది. ఏడు లక్షల మందికి పైగా ఫాలోవర్స్ గల తమ ఫేస్‌బుక్‌ పేజీని తొలగించి వేసిందని వ్యాఖ్యానించింది. ‘ప్రజలు తమ వాణిని వినిపిస్తున్న వేళ.. సిద్ధాంతపరంగా మమ్ముల్ని ఎదుర్కొనలేరు’ అని పేర్కొంది. అసమ్మతి వాణిని అణగదొక్కవద్దని ట్యాగ్‌లు జత చేసింది. 

స్వరాజ్‌ ఇండియా లీడర్‌ యోగేంద్ర యాదవ్‌ స్పందిస్తూ.. ‘ఫేస్‌బుక్‌ లైవ్‌లో నేను మాట్లాడుతున్నప్పుడు కిసాన్‌ ఏక్తా మోర్చా ఫేస్‌బుక్‌ అధికారిక పేజీని తొలగిస్తున్నట్లు మాకు నోటిఫికేషన్‌ అందింది’ అని ట్వీట్‌ చేశారు. ‘రైతుల గురించి ఈ ప్రభుత్వం భయపడుతున్నట్లే ఫేస్‌బుక్‌ కూడా భయపడుతుంది’ అని మరో ట్వీట్‌లో పేర్కొన్నారు. 

కిసాన్‌ ఏక్తా మోర్చా ఫేస్‌బుక్‌ పేజీని తొలగించినట్లు ప్రకటించినా ‘@ఫార్మర్స్‌ ప్రొటెస్ట్‌ ఢిల్లీ’ అనే వ్యక్తిగత బ్లాగ్‌ ద్వారా ఈ సంస్థ ఫేస్‌బుక్‌ ఖాతా యాక్టివ్‌గానే ఉంది. ఇన్‌స్టాగ్రామ్‌లో 76 వేల మందికి పైగా ఫాలోవర్స్‌ను కలిగి ఉంది. సోమవారం అన్ని నిరసన కేంద్రాల్లో ఒకరోజు నిరాహార దీక్ష చేపట్టాలని రైతు సంఘాలు ప్రకటించిన కొన్ని గంటల్లోనే కిసాన్‌ ఏక్తా మోర్చా ఖాతాను ఫేస్‌బుక్‌ తొలగించి వేయడం గమనార్హం. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo