శుక్రవారం 03 జూలై 2020
National - Feb 03, 2020 , 02:28:33

మనం ఓడిపోయాం!

మనం ఓడిపోయాం!
  • చట్టాల్లో డొల్లతనాన్ని బయటపెడుతున్న నిర్భయ కేసు
  • నిబంధనలు కఠినం చేస్తున్నా.. అమల్లో వైఫల్యం
  • ఎఫ్‌ఐఆర్‌ నుంచి చార్జిషీట్‌ వరకు తీవ్ర నిర్లక్ష్యం
  • బాధితులకు అందని సత్వర న్యాయం

న్యూఢిల్లీ: ‘నిర్భయ దోషులు దేశ ప్రజల సహనాన్ని పరీక్షిస్తున్నారు’.. సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా చేసిన వ్యాఖ్య ఇది. చట్టా ల్లో ఉన్న లొసుగులను వాడుకుంటూ దోషులు వేస్తున్న ఎత్తుగడలు.. ఉరి ని ఆలస్యం చేస్తున్న తీరు చూస్తే ఇది అక్షరాలా నిజం అని అనిపి స్తుంది. ఉరి సాగతీతతో ప్రజలు విసుగెత్తిపోతున్నారు. అయితే ఈ దుస్థితికి న్యాయవ్యవస్థనే నిందించడం సరికాదు. మహిళలపై లైంగిక నేరాలకు పాల్పడినవారికి వేగంగా శిక్ష పడేలా చేయడంలో వ్యవస్థ.. మహిళలకు రక్షణ కల్పించడంలో సమా జం విఫలమైంది. నిర్భయ ఘటన నుంచి ఇప్పటివరకు ఏడేండ్లలో జరిగిన పరిణామాలను పరిశీలిస్తే మొత్తంగా ‘మనం ఓడిపోయాం’అని ఒప్పుకోవాల్సిందే. 

చట్టాలు మారాయి.. 

నిర్భయ ఘటన అనంతరం కేంద్రం క్రిమినల్‌ చట్టాలకు సవరణలు చేస్తూ 2013లో ‘నిర్భయ చట్టం’ చేసింది. లైంగికదాడికి స్పష్టమైన నిర్వచనం ఇవ్వడంతోపాటు నాన్‌ బెయిలబుల్‌ కేసులుగా మార్చడం, జీరో ఎఫ్‌ఐఆర్‌ వంటి అనేక నిబంధనలు రూపొందించింది. మహిళల రక్షణకు ‘నిర్భయ నిధి’ని ఏర్పాటుచేసింది. 2018లో జమ్ముకశ్మీర్‌లోని కఠువాలో ఎనిమిదేండ్ల చిన్నారిపై లైంగిక దాడి, హత్య జరిగినప్పుడు దేశవ్యాప్తంగా మరోసారి ప్రజాగ్రహం పెల్లుబికింది. దీంతో మళ్లీ క్రిమినల్‌ చట్టంలో మార్పులు చేసింది. 12 ఏండ్లలోపు బాలికలపై అఘాయిత్యాలకు పాల్పడేవారికి ఉరిశిక్ష విధించాలని ప్రతిపాదించింది. వీటితోపాటు గత ఏడాది కేంద్ర ప్రభుత్వం పోక్సో చట్టం-2012కు సవరణలు చేసింది. బాలలపై లైంగిక నేరాలకు పాల్పడేవారికి మరణశిక్ష విధించేలా నిబంధనలు రూపొందించింది. అయినా ఆశించిన ఫలితాలు రావడం లేదు. 

కోర్టులు క్షమించేస్తున్నాయి 

లైంగిక నేరాల కేసులను విచారించిన కింది కోర్టులు గత నాలుగేండ్లలో ఇచ్చిన తీర్పులను పరిశీలిస్తే.. సగటున 37 శాతం కేసుల్లో మరణశిక్ష పడింది. గరిష్ఠంగా 2019లో 53 శాతం కేసుల్లో నిందితులకు కోర్టులు ఉరిశిక్ష విధించాయి. అయితే అదేసమయంలో ట్రయల్‌ కోర్టుల్లో మరణశిక్ష పడిన కొందరిని పై కోర్టులు క్షమించేస్తున్నాయి. గత నాలుగేండ్లలో హైకోర్టులు 15 మంది, సుప్రీంకోర్టు 11 మంది దోషుల శిక్షలను తగ్గించాయి. అదేసమయంలో హైకోర్టులు 17 మంది దోషులు, సుప్రీంకోర్టు నలుగురు దోషుల మరణశిక్షను సమర్థించాయి.

దేశం తలదించుకునేలా... 

నిర్భయ ఘటన తర్వాత కూడా దేశం తలదించుకునే లైంగికదాడి ఘటనలు అనేకం నమోదయ్యాయి. 2018 లో కఠువాలో ఎనిమిదేండ్ల బాలికపై నాలుగు రోజులు పాశవికంగా లైంగికదాడి చేసి, దారుణంగా హత్య చేసిన ఘటన దేశాన్ని కుదిపేసింది. ఈ కేసులో ఒక పోలీసు సహా ముగ్గురికి యావజ్జీవ శిక్ష పడగా, మరో ముగ్గురు పోలీసులకు ఐదేండ్ల జైలు శిక్ష పడింది. గతేడాది హైదరాబాద్‌లో జరిగిన దిశ ఘటన, ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో జరిగిన సమత ఘటన సంచలనం రేపాయి. యూపీకి చెందిన బీజేపీ ఎంపీ కుల్దీప్‌ సెంగార్‌  2017లో ఉన్నావ్‌కు చెందిన 17 ఏండ్ల బాలికపై లైంగికదాడికి పాల్పడ్డట్టు కోర్టు తేల్చింది. ఇదే ఉన్నావ్‌లో మరో బాధితురాలిని దుండగులు తగులబెట్టి హత్యచేశారు. 

అఘాయిత్యాలు తగ్గలేదు 

చట్టాలు కఠినతరమైనా.. మహిళలపై నేరాల సంఖ్య ఏమాత్రం తగ్గలేదు. పైగా లైంగికదాడులు ఏటికేడు పెరిగాయి. జాతీయ నేర నమోదు సంస్థ (ఎన్సీఆర్బీ) ప్రకారం 2012లో దేశవ్యాప్తంగా 24,923 లైంగికదాడి కేసులు నమోదు కాగా, 2018కి ఆ సంఖ్య 33,356కు పెరిగింది. మహిళలపై అఘాయిత్యాలు దాదాపు 34 శాతం పెరిగాయి.  2012లో ప్రతి పదిలక్షల మంది మహిళల్లో 43 మందిపై అఘాయిత్యాలు నమోదవగా.. 2018 నాటికి ఈ సంఖ్య 53కు పెరిగింది. 2016లో ఈ సంఖ్య 63గా నమోదవడం గమనార్హం.  లైంగికదాడి కేసుల్లో దోషులకు శిక్ష పడాలంటే చార్జిషీట్‌ దాఖలు చేయడం అత్యంత కీలకం. అయితే గత ఏడేండ్లలో చార్జిషీట్ల దాఖలు శాతం తగ్గిపోయింది. 2012లో 96 శాతం కేసుల్లో చార్జిషీట్లు దాఖలుచేయగా.. 2018 నాటికి 85 శాతానికి తగ్గింది. 

ఉరిశిక్ష పడిన కేసుల్లో ‘లైంగిక’ నేరస్థుల సంఖ్య 

2016లో..27

మొత్తం: 150

2017లో..43

మొత్తం: 108

2018లో..67

మొత్తం: 162

2019లో..54

మొత్తం: 102

గత ఏడేండ్లలో కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న లైంగికదాడుల కేసుల సంఖ్య 50 శాతానికిపైగా పెరిగింది. అయితే అదే సమయంలో దర్యాప్తు పూర్తయిన కేసులు పెరిగాయి.


దేశవ్యాప్తంగా కోర్టుల్లో లైంగికదాడి కేసుల పరిస్థితిసంవత్సరం
విచారణ పూర్తి
పెండింగ్‌(లక్షల్లో)
2012
25,000
1.01
2013
34,000
1.15
2014
37,000
1.25
2015
35,000
1.37
2016
39,000
1.52
2017
33,000
1.46
2018
33,000
1.56logo