బుధవారం 27 మే 2020
National - May 08, 2020 , 02:34:23

పరీక్షలు పెరుగడంతో కేసులు పెరిగాయి!

పరీక్షలు పెరుగడంతో కేసులు పెరిగాయి!

  • మే తొలివారంలో కేసుల పెరుగుదలపై నిపుణుల విశ్లేషణ
  • కొన్ని రాష్ర్టాలు కేసులను ఎప్పటికప్పుడు వెల్లడించట్లేదు: కేంద్రం

న్యూఢిల్లీ: దేశంలో అంతకంతకూ వ్యాపిస్తున్న కరోనా మహమ్మారి మే మొదటి వారంలో తన జూలు విదిల్చింది. ముఖ్యంగా మే 2 నుంచి మే 5 వరకు ఏకంగా 12,235 కేసులు వెలుగుచూశాయి. 452 మంది మరణించారు. అంటే రోజుకు సగటున 3,059 కేసులు, 113 మరణాలు నమోదయ్యాయి. 26, ఏప్రిల్‌ నుంచి 30, ఏప్రిల్‌ మధ్య కేసుల్లో సగటు పెరుగుదల రేటు 24.08 శాతంగా ఉంటే మే మొదటి ఐదు రోజుల్లో సగటు పెరుగుదల రేటు 34.07 శాతంగా ఉన్నది. దేశంలో ఇప్పటివరకూ నమోదైన మొత్తం మరణాల్లో దాదాపు 27 శాతం మరణాలు మే 2 నుంచి మే 5 మధ్యలోనే నమోదయ్యాయి. ఈ నాలుగు రోజుల్లో కేసులు, మృతుల సంఖ్యలో ఒక్కసారిగా పెరుగుదల నమోదవ్వడానికి గల కారణాల్ని కేంద్ర ప్రభుత్వం, పలువురు నిపుణులు కింది విధంగా విశ్లేషించారు. ఆ వివరాలు..

దేశంలో కరోనా పరీక్షల్ని ఎక్కువగా నిర్వహిస్తుండటంతో కేసుల సంఖ్య పెరుగుతున్నదని పబ్లిక్‌ హెల్త్‌ ఫౌండేషన్‌ ఆఫ్‌ ఇండియా ప్రెసిడెంట్‌ డాక్టర్‌ కే శ్రీనాథ్‌ రెడ్డి తెలిపారు. 

కొవిడ్‌-19 కేసుల్ని కొన్ని రాష్ర్టాలు ఎప్పటికప్పుడు వెల్లడించడంలేదని కేంద్ర హోంశాఖ పేర్కొంది. ‘రెండు మూడు రోజుల వ్యవధి తీసుకొని కొన్ని రాష్ర్టాలు వైరస్‌ కేసులను ఒకేసారి వెల్లడించడం వల్ల ఒక్కసారిగా కేసుల సంఖ్య పెరుగుతున్నది. గతంలోని (రెండు మూడు రోజుల క్రితం) కేసులను కూడా కలుపుకొని కొన్ని రాష్ర్టాలు కేసుల సంఖ్యను కేంద్రానికి ఇచ్చాయి. దీంతో గత సోమవారం వైరస్‌ కేసుల సంఖ్య ఒక్కసారిగా పెరిగింది’ అని వెల్లడించింది.

మే మూడో వారంలో దేశంలో వైరస్‌ ప్రభావం ఉద్ధృత స్థితి (పీక్‌ స్టేజ్‌)కి చేరుకుంటుందని మిషిగాన్‌ యూనివర్సిటీలో బయోస్టాటిస్టిక్స్‌ విభాగాధిపపతి, ప్రొఫెసర్‌ బ్రామర్‌ ముఖర్జీ తెలిపారు. ఇందులో భాగంగానే మే మొదటి వారం నుంచి కేసుల్లో పెరుగుదల నమోదవుతున్నదని వెల్లడించారు.   

నిర్ణీత దూరాన్ని పాటించడం వంటి జాగ్రత్తల్ని పాటించకపోవడం వల్లే కేసుల సంఖ్యలో పెరుగుదల నమోదైందని మరికొందరు నిపుణులు పేర్కొన్నారు. 

లాక్‌డౌన్‌ 2.0 తర్వాత సడలించిన ఆంక్షల ప్రభావం వల్లే కేసుల్లో పెరుగుదల నమోదైనట్టు చెప్పలేమని మరికొందరు నిపుణులు తెలిపారు. ఈ ఆంక్షల సడలింపుల ప్రభావం ఎలా ఉంటుందో మే 10 తర్వాతనే తెలుస్తుందని వాళ్లు వెల్లడించారు.  

గతకొంతకాలంగా కేసుల్లో పెరుగుదల కనిపిస్తుండటం ఆందోళన కలిగిస్తున్నప్పటికీ, త్వరలోనే వైరస్‌ ప్రభావం తగ్గుముఖం పట్టే అవకాశమున్నదని ఎయిమ్స్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ రణ్‌దీప్‌ గులేరియా తెలిపారు.


logo