శనివారం 30 మే 2020
National - May 09, 2020 , 02:23:05

భయం గుప్పిట్లో విశాఖ

భయం గుప్పిట్లో విశాఖ

  • మళ్లీ గ్యాస్‌ లీక్‌ అయ్యిందని వదంతులు
  • భయపడొద్దని ఎన్డీఆర్‌ఎఫ్‌ సూచన
  • ఎల్జీ పాలిమర్స్‌కు ఎన్జీటీ 50కోట్ల జరిమానా
  • ప్రమాదంపై దర్యాప్తునకు కమిటీ నియామకం

న్యూఢిల్లీ/అమరావతి/ఐక్యరాజ్యసమితి, మే 8: విశాఖపట్నం సమీపంలోని ఎల్జీ పాలిమర్స్‌ కంపెనీలో గ్యాస్‌ లీక్‌ ఘటన భయాలు శుక్రవారం కూడా కొనసాగాయి. మరోసారి గ్యాస్‌ లీకైనట్లు వచ్చిన వందతులతో కంపెనీ చుట్టుపక్కల గ్రామాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లారు.  అయితే రెండోసారి గ్యాస్‌ లీక్‌ అయిందన్న వదంతులను ఎన్డీఆర్‌ఎఫ్‌ కొట్టిపారేసింది. ప్రజలు భయాందోళనలకు గురికావొద్దని సూచించింది. పరిస్థితి అదుపులోనే ఉందని కేంద్ర హోంశాఖ అధికారి ఒకరు చెప్పారు. లీక్‌ అయింది ైస్టెరిన్‌ ఆవిరి అని, గాలితో కలిసి వ్యాప్తి చెందడంవల్ల ప్రాణనష్టం జరిగిందని ఎల్జీ పాలిమర్స్‌ సంస్థ మాజీ ఉద్యోగి, కెమికల్‌ ఇంజినీర్‌ అనంతరాం గణపతి తెలిపారు. కాగా ఈ ప్రమాదంలో మృతులసంఖ్య శుక్రవారానికి 12కు చేరినట్టు అధికారులు తెలిపారు. మరో 193 మంది బాధితులు కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్నారు. మృతుల కుటుంబాలకు ఆంధ్రప్రదేశ్‌  ప్రభుత్వం ప్రకటించిన ఎక్స్‌గ్రేషియా రూ.30 కోట్లు శుక్రవారం విడుదల చేసింది. 

రూ.50 కోట్ల జరిమానా

గ్యాస్‌ లీకేజీ ఘటనను జాతీయ హరిత ట్రిబ్యునల్‌ (ఎన్‌జీటీ) తీవ్రంగా పరిగణించింది. ఆ కంపెనీపై తాత్కాలికంగా రూ.50 కోట్ల జరిమానా విధించింది. ఈ ఘటనను సుమోటోగా స్వీకరించిన ఎన్‌జీటీ శుక్రవారం విచారణ జరిపింది. ప్రమాదంపై విచారణ జరుపడానికి ఐదుగురుసభ్యులతో కమిటీని నియమించింది. ఈ నెల 18లోపు నివేదికను అందజేయాలని కమిటీకి సూచించింది. పర్యావరణ, అటవీశాఖ, ఎల్జీ పాలిమర్స్‌, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర కాలుష్య నివారణ సంస్థ, కేంద్ర కాలుష్య నివారణ సంస్థ, విశాఖపట్నం జిల్లా కలెక్టర్‌కు నోటీసులు జారీచేసింది.

తెలంగాణలో అప్రమత్తం

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: విశాఖపట్నం గ్యాస్‌ లీకేజీ ప్రమాదం నేపథ్యంలో రాష్ట్రప్రభుత్వం అప్రమత్తమైంది. అలాంటి ఘటన రాష్ట్రంలో చోటుచేసుకోకుండా చర్యలు ప్రారంభించింది. లాక్‌డౌన్‌ కారణంగా పరిశ్రమలు మూసి ఉన్నాయని, ప్రస్తుతం వాటిని తనిఖీ చేసి భద్రతా ప్రమాణాలు సరిగా ఉన్నాయా? లేవా? అన్నదానిపై నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించినట్లు డైరెక్టర్‌ ఆఫ్‌ ఫ్యాక్టరీస్‌ గోపాల్‌రావు చెప్పారు. తనిఖీల కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ బృందంలో డిప్యూటీ ఇన్స్‌స్పెక్టర్‌ ఆఫ్‌ ఫ్యాక్టరీస్‌, పరిశ్రమల శాఖ జిల్లా జనరల్‌ మేనేజర్‌, కాలుష్య నియంత్రణ మండలి అధికారి ఒకరు ఉన్నారని పేర్కొన్నారు.


logo