గురువారం 26 నవంబర్ 2020
National - Nov 20, 2020 , 18:15:59

కరోనా ప్రభావం: మరింతగా దెబ్బతిననున్న ఆర్థిక వ్యవస్థ...?

కరోనా ప్రభావం: మరింతగా దెబ్బతిననున్న ఆర్థిక వ్యవస్థ...?

ఢిల్లీ: కరోనా వచ్చి ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలను నష్టాల్లోకి నెట్టేసింది. అందుకు భారత్ మినహాయింపు కాదు. ఇదే విషయాన్ని ఆక్స్‌ఫర్డ్ ఎకనమిక్స్  తన అధ్యయనంలో తెలిపింది. కరోనా ముందు ఉన్న బ్యాలెన్స్ షీట్ మరింత ఒత్తిడికి గురయ్యే అవకాశాలున్నాయని సౌత్ ఏషియా, సౌత్ ఈస్ట్ ఏషియా హెడ్ ఎకనమిస్ట్ ప్రియాంక కిషోర్ నివేదికలో వెల్లడించారు. రానున్న ఐదేండ్లలో భారత ఆర్థిక వ్యవస్థ 4.5శాతం నమోదు చేయవచ్చునని, కరోనా ముందు ఇది 6.5 శాతంగా ఉందని తెలిపారు.

2020కి ముందు ఉన్న వృద్ధిపై కరోనా తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని, ఒత్తిడి కలిగిన కార్పోరేట్ బ్యాలెన్స్ షీట్, బ్యాంకుల నాన్-పర్ఫార్మింగ్ అసెట్స్, బ్యాంకింగేతర సంస్థలు దెబ్బతినడం, కార్మిక మార్కెట్ బలహీనపడటం మరింత దిగజారుతాయని ప్రియాంక కిషోర్ తెలిపారు. కరోనా వల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా దెబ్బతిన్నదని, భారత్ వృద్ధి ధోరణి కూడా కోవిడ్ ముందుస్థాయి కంటే గణనీయంగా తగ్గిపోతుందని పేర్కొన్నారు. కరోనా నేపథ్యంలో ఆర్థిక పతనం కారణంగా 2025 నాటికి 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదగాలన్న లక్ష్యంపై ప్రభావం చూపుతుందని తెలిపారు. వైరస్ కారణంగా దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థ పుంజుకోవడానికి, డిమాండ్ చర్యలు పెంచేందుకు ప్రభుత్వం పలు చర్యలను ప్రకటించిందని, అయితే అది సరిపోదని అభిప్రాయపడ్డారు.

వడ్డీ రేట్ల తగ్గింపు వంటి నిర్ణయాలతో ఆర్బీఐ కూడా డిమాండ్ పెంచే చర్యలు తీసుకుందని తెలిపారు. భారత్ టెక్నికల్‌గా మాంద్యంలోకి ప్రవేశించినట్లు ఓ డేటా వెల్లడించింది. ప్రజల ప్రాణాలు ముఖ్యమని భావించి మార్చి చివరి వారం నుండి లాక్ డౌన్ విధించిన విషయం తెలిసిందే. దీని వల్ల 2020-21 ఆర్థిక సంవత్సరంలో వృద్ధి మైనస్ 10.3 శాతం ఉంటుందని ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అంచనా వేసింది. భారత ఆర్థిక వ్యవస్థ వేగంగా కోలుకుంటున్నప్పటికీ కరోనా ప్రభావం దీర్ఘకాలం ఉంటుందని పేర్కొంది. 2025 వరకు భారత ఆర్థిక వ్యవస్థకు ఇబ్బందులు తప్పవని చెబుతున్నారు.

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.