బుధవారం 25 నవంబర్ 2020
National - Nov 10, 2020 , 15:51:15

సాయుధ బలగాలకు బంగారం విరాళంగా ఇచ్చిన మాజీ ఎమ్మెల్సీ

సాయుధ బలగాలకు బంగారం విరాళంగా ఇచ్చిన మాజీ ఎమ్మెల్సీ

నాసిక్ : మన దేశంలోని మహిళలకు ఎంతో ఇష్టమైన వస్తువు బంగారం. బంగారం సంప్రదాయం, కుటుంబ సంబంధాలతో ముడిపడి ఉన్న అత్యంత విలువైన ఆస్తి. అంతటి విలువైన ఆస్తిని తన కోసం పెట్టుకోకుండా సాయుధ బలగాల కోసం అందించి ఆదర్శంగా నిలిచారు. మహారాష్ట్రకు చెందిన మాజీ ఎమ్మెల్సీ నిషిగంధ మొగల్‌.. తన వద్ద ఉన్న రూ.20 లక్షల విలువైన బంగారాన్ని భారత సాయుధ బలగాలకు విరాళంగా అందించారు. ఇటీవల తన 75 వ పుట్టినరోజు జరుపుకున్న నిషిగంధ మొగల్‌.. యుద్ధ వితంతువులతో పాటు రిటైర్డ్ ఆర్మీ సిబ్బంది సంక్షేమాన్ని కాంక్షించి ఏదో ఒకటి చేయాలని అనుకున్నారు. తన వద్ద ఉన్న బంగారంలో నుంచి దాదాపు రూ.20 లక్షల విలువైన బంగారు నగలను ఆమె సాయుధ దళాల నిధికి అందజేశారు. ఈ విషయమై మీడియా ఆమె స్పందన కోరగా.. ఇదేమంత పెద్ద విషయం కాదని కొట్టిపారేశారు. “యూనిఫాంలో ఉండే ధైర్యవంతుల పట్ల నా కర్తవ్యాన్ని నిర్వర్తించాలని అనుకున్నాను. రక్షణ సిబ్బంది సంక్షేమం కోసం నా బంగారు ఆభరణాలను దానం చేయాలని నిర్ణయించుకున్నాను. తన వ్యక్తిగత ఆలోచనను తల్లి ప్రభావితం చేసింది” అని చెప్పారు. నిషిగంధ మొగల్ 1996-2000 మధ్య ఐదేండ్లపాటు కౌన్సిలర్‌గా కూడా పనిచేశారు. నిషిగంధ మొగల్‌ చేసిన విరాళం పట్ల ప్రధానమంత్రి నరేంద్రమోదీ సంతోషం వ్యక్తంచేసి.. ఆమె ఆదర్శాన్ని మెచ్చుకుంటూ వ్యక్తిగతంగా ఆమెకు లేఖ రాసి అభినందించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.