శనివారం 05 డిసెంబర్ 2020
National - Oct 10, 2020 , 22:27:00

మాజీ కానిస్టేబుల్‌‌కు.. మాజీ డీజీపీ ఆశించిన సీటు

మాజీ కానిస్టేబుల్‌‌కు.. మాజీ డీజీపీ ఆశించిన సీటు

పాట్నా: బీహార్ మాజీ డీజీపీ ఆశించిన సీటు లక్కీగా మాజీ కానిస్టేబుల్‌కు దక్కింది. బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ మరణంపై తనదైన వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచిన బీహార్ డీజీపీ గుప్తేశ్వర్ పాండే ఇటీవల వాలంటరీ రిటైర్‌మెంట్ తీసుకున్నారు. ఆ రాష్ట్ర ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనంతరం అధికార జేడీ(యూ)లో చేరారు. బక్సర్ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని ఆయన ఆశించారు. అయితే సీట్ల పంపకాల్లో భాగంగా ఆ స్థానం బీజేపీకి దక్కింది. 2008లో పోలీస్ కానిస్టేబుల్‌గా రాజీనామా చేసి రాజకీయాల్లో చేరిన పరశురామ్ చతుర్వేదికి పార్టీ టికెట్ ఇచ్చింది. బీజేపీ రైతు విభాగం సభ్యుడైన ఆయన నాలుగు సార్లు కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచిన జగత్ లాల్ చతుర్వేది కుమారుడు. మరోవైపు స్థానిక ఎంపీ, కేంద్ర మంత్రి అశ్వనీ కుమార్ చౌబే మద్దతు కూడా పరశురామ్ చతుర్వేదికి ఉండటంతో బక్సర్ టికెట్ ఆయనకే దక్కింది. దీంతో రెండోసారి రాజకీయ ప్రవేశం కోసం ప్రయత్నించిన మాజీ పోలీస్ బాస్ గుప్తేశ్వర్ పాండేకు మరోసారి భంగపాటు ఎదురైనట్లయ్యింది.