మంగళవారం 31 మార్చి 2020
National - Feb 13, 2020 , 03:25:42

బ్యాలెట్‌కు తిరిగి వెళ్లే ప్రసక్తే లేదు

బ్యాలెట్‌కు తిరిగి వెళ్లే ప్రసక్తే లేదు

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 12: బ్యాలెట్‌ పత్రాల విధానంలో ఎన్నికల నిర్వహణకు మళ్లీ వెళ్లే ప్రసక్తే లేదని కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్‌ (సీఈసీ) సునీల్‌ అరోరా స్పష్టం చేశారు. ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాలను (ఈవీఎం) ట్యాంపరింగ్‌ చేయడం అసాధ్యమని చెప్పారు. బుధవారం ఆయన ఢిల్లీలో జరిగిన ‘టైమ్స్‌ నౌ సమ్మిట్‌'లో మాట్లాడుతూ ఈవీఎంల ట్యాంపరింగ్‌పై రాజకీయ పార్టీల నాయకులు ఇష్టారాజ్యంగా మాట్లాడటం సరికాదన్నారు. ఒక పెన్ను (కలం) లేదా ఒక కారులో మాదిరిగా ఈవీఎంలలో కూడా సాంకేతిక సమస్యలు తలెత్తవచ్చు గానీ వాటిని ట్యాంపరింగ్‌ చేయడం అసాధ్యమన్నారు. 20 ఏండ్లుగా దేశంలో ఈవీఎంలతోనే ఎన్నికలు నిర్వహిస్తున్నామని సునీల్‌ అరోరా గుర్తు చేశారు. సుప్రీంకోర్టుతోపాటు పలు న్యాయస్థానాలు ఈవీఎంలతో ఎన్నికల నిర్వహించడాన్ని సమర్థించాయని చెప్పారు. త్వరలోనే రాజకీయ పార్టీల నేతలతో సమావేశం నిర్వహించి ఎన్నికల సంస్కరణలు, ప్రవర్తనానియమావళిపై చర్చిస్తామని చెప్పారు. 


ఏకకాలంలో లోక్‌సభ, రాష్ర్టాల అసెంబ్లీలకు ఎన్నికలను నిర్వహించే విషయమై రాజకీయ పార్టీలు నిర్ణయం తీసుకోవాలన్నారు. ఒకసారి నిర్ణయం తీసుకుంటే ఏకకాలంలో అసెంబ్లీలు, లోక్‌సభకు ఎన్నికల నిర్వహణకు ఈసీ చర్యలు తీసుకుంటుందన్నారు. బ్లాక్‌ చైన్‌ టెక్నాలజీ వినియోగంపై ఐఐటీ- మద్రాస్‌తో కలిసి ఎన్నికల సంఘం పని చేస్తుందని, ఇది అమల్లోకి వస్తే చెన్నైలో పని చేసే ఒక రాజస్థాన్‌ వాసి.. అక్కడి నుంచి రాజస్థాన్‌ ఎన్నికల్లో ఓటేయవచ్చునన్నారు. అయితే, దీనర్థం ఇంటి నుంచి ఓటు హక్కు వినియోగించుకోవడం కాదని, నిర్దేశిత పోలింగ్‌ కేంద్రానికి వచ్చి ఓటేయాల్సి ఉంటుందని తెలిపారు. ఇందుకోసం చట్టంలో మార్పులు చేయాల్సిన అవసరం ఉంటుందని సునీల్‌ అరోరా వివరించారు. 


logo
>>>>>>